బ్రహ్మాస్త్ర సినిమా ప్రచారంలో భాగంగా రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ జంట జోరుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కొద్ది రోజులు క్రితం తెలుగునాట సందడి చేసిన ఈ జంట ప్రస్తుతం నార్త్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్ ‘బ్రహ్మాస్త్ర’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్రహ్మాస్త్ర చిత్రం ప్రత్యేకత ఏంటి? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘సినిమా విడుదలయ్యాక ఈ ప్రశ్నకు ప్రేక్షకులే సమాధానం చెప్తారు. ఇక నా విషయానికొస్తే ‘బ్రహ్మాస్త్ర’ నాకు, ఆలియాకు చాలా ప్రత్యేకం. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇద్దరి డీఎన్ఏలో బ్రహ్మాస్త్ర ఒక భాగం. ఈ సినిమాతోనే నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఆస్వాదిస్తున్నాను.
బ్రహ్మాస్త్ర షూటింగ్ రోజుల్లో ఆలియాను నా జీవితంలోకి ఆహ్వానించడం, మేమిద్దరం ఒక్కటవ్వడం, మా జీవితంలోకి మరొకరు రావడం ఇవన్నీ ఓ కలలా జరిగిపోయాయి. ఇంకా ఆలియాకు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. గంగూభాయి కథియావాడి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయాల్లో భాగమైన ఆమె ఇప్పుడు బ్రహ్మాస్త్ర చిత్రంలోనూ కీలకం కానుంది. నిజానికి ఆలియాకు నేను హైవే చిత్రం నుంచే పెద్ద అభిమానిని’ అంటూ వెల్లడించాడు.
ఈ కార్యక్రమంలో ఆలియా మాట్లాడుతూ..‘నిజంగా బ్రహ్మాస్త్ర మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. మా డైరెక్టర్ అయాన్ పెద్ద అద్భుతాన్ని సృష్టించారు. కృషి, నిబద్ధత ఆయాన్ అనే వ్యక్తికి పర్యాయపదాలు. ఇక రణ్‌బీర్ విషయానికొస్తే అతడి చిత్రాల్లో నాకు బర్ఫీ అంటే ఇష్టం. ఎందుకంటే ఆ చిత్రంలో రణ్‌బీర్ కళ్లతో నటించాడు’ అని చెప్పుకొచ్చింది.
ఈ నెల 9న విడుదల కానున్న ‘బ్రహ్మాస్త్ర’ దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో త్రీడీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, ఆలియాభట్ జంటగా నటించగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలకపాత్రలు పోషించారు.