బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ చూసాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ డిమాండ్ చేశారు. కేవలం లిక్కర్ స్కాం నుంచి దేశ ప్రజలను పక్క దారి పట్టించేందుకే.. కవిత మహిళా రిజర్వేషన్ డ్రామా అనేది ఈ లిస్ట్ తో రుజువైందన్నారు. 119 స్థానాల్లో ఏడుగురు మహిళలకు టికెట్ లు ఇచ్చిన మీకు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడే అర్హత లేదన్నారు. జనాభా లో 50% ఉన్న మహిళలకు బీఆర్ఎస్ పార్టీ 3% టికెట్ లు ఇస్తూ.. దేశ వ్యాప్తంగా పార్టీ కమిటీలల్లో మహిళలకు 30% రిజర్వేషన్ ఇస్తున్న బీజేపీ మీద వీళ్ళు పోరాటం చేస్తాననడం సిగ్గుచేటన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీ రోడ్ల మీద ధర్నాలు చేసిన కవిత.. ప్రగతి భవన్ ముంగట ఎందుకు ధర్నా లు చేయలేదని ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చించి పారేసిన పార్టీలతో అంటకాగుతూ, సొంత పార్టీలో ఏ ఒక్క కమిటీలో మహిళలకు స్థానం ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ కథను, ఎమ్మెల్సీ కవిత దొంగ దీక్షను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. పట్టుమని పదిమందికి కూడా టిక్కెట్ ఇవ్వనప్పటికీ… ఉరికి ఉరికి కవిత ధర్నాలో కూర్చున్న నాయకులంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.