జబర్దస్త్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ రష్మి గౌతమ్. అంతకు ముందు పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. జబర్దస్త్ ఆమెను ఓవర్ నైట్ స్టార్‌ను చేసేసింది. ఇప్పుడు ఓ వైపు జబర్దస్త్ చేస్తూనే కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా నటించారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా వైజాగ్‌లోని తన ఇంటికే పరిమితమయ్యారు రష్మి. సాధారణంగా మూగ జీవాలను ఇష్టపడే రష్మి.. ఈ కష్టకాలంలో తనకు సాధ్యమైనంత మేర వాటికి ఆహారం అందేలా చేస్తున్నారు. ముఖ్యంగా వీధుల్లోని కుక్కలకు ఆహారం అందించడమే కాకుండా.. వాటికి ఫుడ్ అందించాల్సిందిగా జంతు ప్రేమికులను కోరుతున్నారు.
మూగ జీవాలకు ఆహారం అందజేసిన వారిలో కొందరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ సమయంలో తానే బర్త్ డే (ఏప్రిల్ 27) వచ్చింది. దీంతో ఇంట్లోనే తన తల్లితో కలిసి క్వారంటైన్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. తన తల్లి ప్రేమతో తయారు చేసిన అట్టే కా హల్వాను కోసి ఈ వేడుక జరుపుకున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ రుచి కూడా వైజాగ్‌లోనే ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో కలవడం కుదరలేదని రష్మి చెప్పారు. అలాగే లాక్ డౌన్ పూర్తయ్యాక బర్త్ డే పార్టీ ఇవ్వనున్నట్టు తెలిపారు.
“అమ్మతో కలిసి బర్త్ డే జరుపుకుంటున్నాను. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మే. నాకు బయటి నుంచి కేక్ తెప్పించుకోవాలని ఉండే కానీ మా అమ్మ వద్దని చెప్పేసింది. అందుకే ప్రత్యేకంగా నాకిష్టమైన అట్టే కా హల్వా తయారు చేసింది. నా ఫ్రెండ్ రుచి నా కోసం కేక్ తయారు చేసింది. ప్రస్తుతం ఇద్దరం వైజాగ్‌లోనే ఉన్నాం.. మేమిద్దరం కలుద్దామని అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కుదరదు కాబట్టి మా అమ్మ నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టింది. మసాలా దోశ, వడతో పాటుగా మరికొన్ని వంటకాలు కూడా చేసింది. బర్త్ డే విషెస్ చెప్పిన వారికి ధన్యవాదాలు. బర్త్ డే పార్టీలు అంటే నాకు చాలా ఇష్టం. లాక్ డౌన్ అయ్యాక బర్త్ డే పార్టీ ఇస్తాను” రష్మి తెలిపారు.