ప్రతి హీరోయిన్ కు.. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు అభిమాన హీరో ఉంటాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత.. లైఫ్ లో ఒక్కసారైన తన అభిమాన హీరోతో కలిసి నటించాలని ప్రతి కథానాయిక అనుకుంటుంది. ఇక ఆ ఛాన్స్ వచ్చిందంటే చాలు ఎగిరి గంతేస్తారు. కథ.. డైరెక్టర్.. ఇలా ఏం పట్టించుకోకుండా తమది చిన్న పాత్ర అయినా.. దానికి ఇంపార్టెన్స్ లేకపోయినా.. ఆ హీరోతో నటించడానికి ఒప్పేసుకుంటారు.
ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు కూడా అలాంటి అవకాశమే వచ్చింది. అందుకే రష్మిక కూడా తన ఫేవరెట్ హీరోతో నటించే ఛాన్స్ రాగానే ముందూ వెనక ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. ఆ సినిమాయే వారసుడు.. ఆ హీరో తమిళ్ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్. విజయ్ ‘వారిసు’లో తన పాత్రకి కేవలం రెండు పాటలు తప్ప.. నటించడానికి ఏమీ లేదని రష్మిక ఒప్పేసుకుంది. విజయ్ కోసమే తాను ఆ స్క్రిప్ట్ ఓకే చేసినట్లు చెప్పేసింది. తాజాగా ఓ ఆంగ్ల ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమెను.. ‘‘వారిసు’లో మీ పాత్రకు ఎలాంటి స్కోప్ లేనప్పటికీ ఎందుకు ఓకే చేశారు?’ అని విలేకరి ప్రశ్నించింది.
‘‘అవును. అయితే, ఈ కథను ఓకే చేయడమనేది పూర్తిగా నా సొంత నిర్ణయం. ఇష్టప్రకారమే దాన్ని ఓకే చేశాను. విజయ్ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ సినిమాలో నటించాను. అందులో నా పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని, కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని నాకు తెలుసు. అయితే ఆ రెండు పాటల్లోనూ అదరగొట్టేయాలనుకున్నాను. ఇదే విషయాన్ని సినిమా షూట్‌లో ఉన్నప్పుడు విజయ్ సార్ వద్దకు వెళ్లి సరదాగా చెబుతుండేదాన్ని. ‘సినిమాలో నేను చేయడానికి కేవలం పాటలు తప్ప ఏమీ లేదు సర్’ అని జోక్స్ వేసేదాన్ని.‘‘ అని రష్మిక చెప్పింది.
‘‘అన్నీ నాకు తెలిసి చేసినవే. ఒక నటిగా సినిమా సెట్‌కు వెళ్లి, ఇతరులతో కలిసి పని చేయడం ద్వారా వారి నుంచి చిన్న చిన్న విషయాలను కూడా నేర్చుకునేదాన్ని. నాకు నటించేందుకు పెద్దగా అవకాశం లేకపోయినా, ఇందులో భాగస్వామిని కావాలని అనుకున్నా. ఒక నటిగా అన్ని పాత్రలు నేను చేయాలి. అందుకే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటించా. నా వరకూ నేను సంతృప్తిగానే ఉన్నాను’’ అని రష్మిక చెప్పుకొచ్చింది.