ఎవరెన్ని చెప్పినా తెలుగు మీడియా కష్టాల్లో ఉంది. పెరిగిపోయిన చిన్న పత్రికలు, యూ ట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్రభావంతో మీడియాను పట్టించుకునే వాళ్లే లేరు. ఇప్పుడు వాళ్లు కూడా తమ వార్తలను సోషల్ మీడియాలోను, యూట్యూబ్‌లోనూ ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయలు లేకపోవడం.. ఇటు రాజకీయంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వాల ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గిపోవడంతో మీడియాలో అటు పత్రికలు, ఇటు ఛానెల్స్ నడపడం చాలా కష్టమైంది.
కొద్ది రోజుల క్రితమే మోజో టీవీ మూతపడడంతో చాలా మంది మీడియా మిత్రుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదే బాటలో మరో మూడు న్యూస్ ఛానెల్స్ ఉన్నట్టు మీడియ సర్కిల్స్‌లో ప్రచారం నడుస్తోంది. ఇక ఇప్పుడు మరో ప్రముఖ పార్టీకి చెందిన ఛానెల్ సైతం అంగట్లో అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. ఓ రెండు జంట పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం కొన్నేళ్ల క్రితమే రెండు ఛానెల్స్ పెట్టుకున్నాయి.
ఈ రెండు ఛానెల్స్‌లో ఒక పార్టీ తమ ఛానెల్ నడపలేక ఓ సినిమా స్టార్ పార్టీకి చెందిన నాయకుడికి ఎన్నికలకు ముందే అమ్మేసింది. అయితే ఇప్పుడు ఆయన కూడా భారీ నష్టాలు రావడంతో ఆ ఛానెల్‌ను నడప లేక చేతులు ఎత్తేస్తున్నారు. ఆయన కూడా ఆ ఛానెల్ అమ్మకానికి పెట్టినా రేటు కుదరక ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇక ఇప్పుడు ఆ జంట పార్టీలోనే మరో పార్టీకి చెందిన ఛానెల్ అమ్మకానికి భేరం పెట్టేశారట.
వాస్తవానికి ఆ ఛానెల్‌కు మంచి పేరు ఉంది. టాప్ రేటింగులు కూడా ఉన్నాయి. అయినా విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి రు. 40 కోట్లకు బేరం పెట్టారట. అయితే వేలాదిగా ఉన్న ఆ ఛానెల్ షేర్ హోల్డర్లకు రు.200 కోట్లు వరకు చెల్లించాల్సి ఉందట. ఈ ఛానెల్ కూడా నడపలేకపోతే మరి కొంత మంది జర్నలిస్టు మిత్రులు రోడ్డున పడాల్సిందే. మరో ట్విస్ట్ ఏంటంటే తెలుగు మీడియా రంగంలోనే టాప్ ఛానెల్ అని చెప్పుకునే ఛానెల్ మేనేజ్‌మెంట్ సైతం ఇటీవల మారింది.
ఇప్పుడు ఆ ఛానెల్ వాళ్లు తమ సంస్థలో ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగులను తొలగించుకునేందుకు నెలకు ఏకంగా రు.12 కోట్ల నష్టం వస్తుందని చూపించారట. కేవలం భారీగా జీతాలు ఇస్తోన్న ఉద్యోగులను బలవంతంగా బయటకు పంపించే ప్రక్రియలో భాగంగానే ఈ ఛానెల్ ఇలా చేస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదేమైనా తెలుగు మీడియా రంగం అనేది కుప్పకూలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.