ఆ తప్పే ‘విరాటపర్వం’ కొంపముంచిందా?

-

రానా, సాయిపల్లవి నటించిన ప్రేమకథా చిత్రం ‘విరాటపర్వం’. తెలంగాణలో 1990 దశకంలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. జూన్‌ నెలలో విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘విరాటపర్వం’పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. క్లైమాక్స్‌లో మార్పులు చేసి ఉంటే సినిమా వేరేలా ఉండేదని ఆయన అన్నారు.

“నిజం చెప్పాలంటే.. ఇందులో రానా దగ్గుబాటి పేరు వాడారు.. కానీ, ఇది సాయిపల్లవి మోనో యాక్షన్‌ చిత్రం. సినిమా ఆద్యంతం మన చూపు ఆమెపైనే ఉంటుంది. 400 సినిమాలు రాసిన నేను ‘విరాటపర్వం’ చూస్తున్నంతసేపు ఆమెనే చూస్తూ ఉండిపోయాను. అన్నిరకాల భావోద్వేగాలను ఆమె అద్భుతంగా పలకించింది. ఈ సినిమాకు ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వరిస్తుందేమో అనిపించింది. వేణు ఉడుగుల మూడేళ్లు రీసెర్చ్‌ చేసి మరీ దీన్ని రూపొందించారు. ఇది అనుకున్నంతగా విజయం సాధించకపోవడానికి ఓ కారణం.. సమయం కానీ సమయంలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం. ఎందుకంటే, ప్రజలందరూ కమర్షియల్‌ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఈ విధమైన విప్లవ భావాలున్న సినిమా రూపొందించడమంటే ధైర్యం చేశారనే చెప్పాలి. ఈ సినిమా విషయంలో రానాని అభినందించాలి. ఇది రిస్కీ ప్రాజెక్ట్ అని తెలిసి కూడా.. నిర్మాణంలో భాగమయ్యారు. అలాగే, కేవలం ఒక నటి కోసం.. తన పాత్రకు అంతగా ప్రాధాన్యం లేనప్పటికీ ఇందులో నటించారు. ఇక, నటీనటుల్ని ఎంచుకున్న విధానం, సాయిపల్లవి పాత్ర చిత్రీకరణ, కథా, కథనం నడిపిన తీరు.. ఇలా ప్రతిదీ అద్భుతంగా ఉన్నాయి”

“ఈ సినిమా ముగింపు చాలా హృదయ విదారకంగా ఉంది. వాస్తవ కథను చూపించాలనే ఉద్దేశంతో నిర్మాత, దర్శకుడు ఈ విధంగా దీన్ని రూపొందించారు. అందుకు, వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. కానీ, వాళ్లే కనుక సినిమాటిక్ అడ్వాంటేజ్‌ తీసుకున్నట్లయితే.. ఫలితం మరోలా ఉండేదని నా అభిప్రాయం. సినిమాలో చూపించిన విధంగా కాకుండా రవన్న-వెన్నెలకు పెళ్లి చేసి.. నక్సలైట్స్‌ రూల్స్‌ ప్రకారం పెళ్లైన వెంటనే వాళ్లిద్దర్నీ కొన్ని నెలల పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి.. ఇబ్బందులు ఎదుర్కొని చివరికి కలిసినట్లు చూపిస్తే ఫలితం మరోలా ఉండేదని నా ఉద్దేశం” అని పరుచూరి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news