ఆ వైసీపీ రెడ్డి మంత్రికి రెడ్ల శాపం.. రీజ‌నేంటి…?

-

కొన్ని సామాజిక వ‌ర్గాల్లో క‌లివిడి అనేది వారికి జ‌రుగుతున్న ప‌నులు, అందుతున్న ల‌బ్ధిని బ‌ట్టి ఆధార‌ప‌డుతుంద‌ని అంటారు. అంటే.. ఆయా సామాజిక వ‌ర్గాల్లోని వారు దేనికైనా.. “మాకేంటి?“- అనే ధోర‌ణితో ఆలోచిస్తార‌ని, దానిని బ‌ట్టే ఫాలోయింగ్ ఉంటుంద‌ని చెబుతారు. కానీ, రెడ్డి సామాజిక వ‌ర్గంలో మాత్రం.. “మాకేంటి?“ అనే ధోర‌ణి ఉన్న‌ప్ప‌టికీ.. దీనికంటే..కూడా త‌మ‌కు వాల్యూ ఇచ్చి.. మెచ్చుకోళ్లు మాట‌లు చెబితే.. ప‌డిపోతార‌ని అంటారు. అంటే.. వీరికి ప‌నులు అవ‌స‌రం లేదా? అని కాదు.. కానీ, వారిని ప‌ట్టించుకుంటే.. మురిసిపోతారు.. భుజాల‌పై మోసేస్తారు అనేది ఎక్కువ‌గా వ‌ర్క‌వుట్ అవుతుంది.

దీంతో రెడ్డిగారిని పొగిడితే .. ప‌డిపోతార‌నే టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తూ ఉంటుంది. మ‌రి ఈ విష‌యంలో ఎందుకో.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎక్క‌డో ఫెయిల్ అయ్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇప్పుడు అదే రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఆయ‌న ఒంటరి అవుతున్నారు కాబ‌ట్టి! అది కూడా సొంత పార్టీలోనే ఆయ‌న ఒంట‌రి అవుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి ? అనేది కీల‌క ప్ర‌శ్న‌. తాజాగా మంత్రి నారాయ‌ణ‌స్వామి కూడా ఇదే వ్యాఖ్య చేశారు. “పెద్దిరెడ్డిని రెడ్లు దూరం పెట్టారా ? “ అనే సందేహం వ్య‌క్తం చేశారు. దీంతో ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించాయి.

త‌న సొంత జిల్లాలోనే త‌న‌కు రెడ్లు దూరం కావ‌డంపై పెద్దిరెడ్డి ఎలా ఫీల‌తున్నారో.. అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఇటీవ‌ల కాలంలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని టీడీపీ అధినేత చంద్ర‌బాబు టార్గెట్ చేశారు. దీనికి కార‌ణం.. చిత్తూరులో టీడీపీకి ఆయ‌న పూర్తిగా ఎస‌రు పెడుతుండ‌డ‌మే. మ‌రీ ముఖ్యంగా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై తెర‌చాటు వ్యూహాలు పెద్దిరెడ్డి అమ‌లు చేస్తున్నారు. దీంతో బాబు ఆయ‌న‌ను రాజ‌కీయంగా టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ద‌ళిత వ్య‌తిరేకి.. బీసీ వ్య‌తిరేకి.. అంటూ.. ముద్ర‌లు వేశారు.

ఈ నేప‌థ్యంలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఏం చేస్తోంద‌నేది కీల‌క ప్ర‌శ్న‌. ఏ సామాజిక వ‌ర్గం నాయ‌కుడిని ప్ర‌తిప‌క్షం టార్గెట్ చేసినా.. ఆ సామాజిక వ‌ర్గం వెంట‌నే స్పందిస్తున్న నేటి కాలంలో వైసీపీలోనే.. అందునా పెద్దిరెడ్డికే ఎందుకు ఇలా జ‌రుగుతోంద‌నేది కీల‌క ప్ర‌శ్న‌. దీనికి కార‌ణం.. నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరు స‌హా.. జిల్లాలో రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని పెద్దిరెడ్డి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, క‌నీసం వారికి అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేదని.. పైగా రెడ్డినేత‌లు అంద‌రూ తాను చెప్పిన‌ట్టే వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న హుకుం జారీ చేస్తున్నార‌ని, మ‌రికొంద‌రు రెడ్డి నేత‌ల‌కు ప‌రోక్షంగా చెక్ పెడుతున్నార‌ని.. అందుకే ఆయ‌న‌నురెడ్డి వ‌ర్గం ప‌ట్టించుకోవ‌డం మానేసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

-vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Exit mobile version