ఏపీ రాజధాని అమరావతిపై నీలి నీడలు కమ్ముకున్నాయా.. ఇప్పుడు ఓ రిపోర్టు పుణ్యమా అని అమరావతి నిర్మాణం జరుగడం కల్లేనా.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమరావతిని నిర్మించుకోవాలని అనుకున్న కలలు కల్లలు అయ్యేలా ఉన్నాయి. రాజధాని కోసం వేల ఎకరాల భూములను సేకరించి, రాజధాని నిర్మాణంకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఏపీలో అధికారం చేతులు మారడం, రాజధాని నిర్మాణం ముందుకు సాగకపోవడం, దీనిపై రాజకీయ దుమారం రేగడం తెలిసిందే.
రాజధానిపై రాజకీయ రగడ జరుగుతున్నా దానిపై ఇంత వరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఏమాత్రం స్పందించలేదు.. రాజధాని నిర్మాణం అమరావతిలో జరుగుతుందా లేదా అని సంశయంలో ఉండగానే అమరావతి నిర్మాణంపై ఇప్పుడు వచ్చిన ఓ రిపోర్టుతో నీలినీడలు కమ్ముకున్నాయనే చెప్పవచ్చు. ఆ రిపోర్టు ప్రకారం అమరావతి నిర్మాణం జరగడం కల్లగానే మిగిలిపోనున్నది. అసలు ఇక్కడ రాజధాని నిర్మాణమే సరికాదని గతం నుంచి చెపుతున్నది ఇప్పుడు ఆ రిపోర్టుతో నిజమని తేలింది.
ఇంతకు ఏ రిపోర్టు రాజధాని నిర్మాణంకు అడ్డుగా మారింది. అసలు ఆ రిపోర్టు ఏంటిది.. ఎవ్వరు తయారు చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితమా.. లేక పర్యావరణ ప్రేరేపితమా అనేది ఓసారి చూస్తే అది రాజకీయ ప్రేరేపితం కాదని, అది కేవలం ప్రకృతి వైపరిత్యమే అని చెప్పవచ్చు. అంటే ప్రకృతి వైపరీత్యంతో అమరావతి ఆగిపోవడం ఏంటనే కదా మీ డౌట్.. గత మూడేళ్ళుగా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక రిపోర్టును రెడీ చేశాయి.
సముద్రతీర ప్రాంతాల్లో ఎంతమంది ప్రజలు ఉంటున్నారు..? ఇళ్ల నిర్మాణం ఎలా ఉంది? ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి..? సముద్రానికి ఎంత దూరంలో ఉన్నాయి..? గతంలో ఎప్పుడైనా అక్కడ భూకంపాలు వచ్చాయా..? వంటి అంశాలను లెక్కలోకి తీసుకుని పరిశోధన చేశాయి. సుమారు మూడేళ్ల పాటు.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లోని ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ (ఈఆర్‌సీసీ) చీఫ్ ప్రొఫెసర్ ప్రదీప్ నేతృత్వంలో తన విద్యార్థులతో కలిసి ఈ రిపోర్టును సిద్ధం చేశారు.
ఈ రిపోర్టు ప్రకారం విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు రాబోతున్నాయట. అతి భయంకరమైన భూకంపాలకు ఆవాసంగా విజయవాడ పరిసర ప్రాంతాలు ఉన్నాయట. దీంతో ఇక్కడ ఎప్పుడైనా ఎక్కడైనా భూకంపాలు రావొచ్చట. భూకంపం వస్తే దాదాపుగా 4నుంచి 6 రిక్టర్ స్కేల్‌పై నమోదు అవుతుందట. ఈ భూకంపం కేవలం విజయవాడలోనే కాదు దేశంలోని 50నగరాల్లో రానున్నదట. అందులో 13నగరాల్లో తీవ్రంగా ప్రభావం ఉంటుందట. అందులో విజయవాడ కూడా ఒకటి.
అందుకే ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగితే రాబోవు రోజుల్లో ఈ భూకంపాలు వస్తే చేసిన వ్యయం అంతా వృధా అయ్యే అవకాశాలు లేకపోలేదు. కేవలం ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ అమరావతి నిర్మాణం జరిగేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ భూకంప అధ్యయనం అమరావతి నిర్మాణంకు అడ్డంకిగా మారే అవకాశాలు లేకపోలేదు.