తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి..పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ములుగు నుంచి మొదలుపెట్టిన రేవంత్ పాదయాత్ర..విజయవంతంగా ముందుకెళుతుంది. ప్రజా సమస్యలని తెలుసుకుంటూ రేవంత్ ముందుకెళుతున్నారు. తనదైన శైలిలో పాదయాత్రతో దూసుకెళుతున్న రేవంత్..పలు సంచలనాలకు తెరలేపుతున్నారు. ఎప్పటిలాగానే కేసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న రేవంత్..తాజాగా ప్రగతి భవన్ నక్సలైట్లు పేల్చేసిన పర్లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చివేయాలని, 10 ఎకరాల్లో 110 గదులతో కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి నిర్మించిన ప్రగతి భవన్ ఆంధ్రా పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచి, స్వాగతం పలుకుతోందని ఫైర్ అయ్యారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం కోసమేనా అని ప్రశ్నించిన రేవంత్… తెలంగాణ ద్రోహులైన ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి లాంటి వారిని మంత్రులు చేశారని మండిపడ్డారు.
2024లో రాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే పోడుభూములకు పట్టాలిచ్చే బాధ్యత తమదేనని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే ప్రగతి భవన్ నక్సలైట్లు పేల్చేయాలని రేవంత్ వ్యాఖ్యలు చేయడంపై బిఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పాదయాత్ర అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.
అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనుకున్న మేర హైలైట్ కావడం లేదు..ఈ సంచలన వ్యాఖ్యలతో రేవంత్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారని చెప్పవచ్చు. ఇక పాదయాత్రలో ఇదే విధంగా రేవంత్ దూకుడుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి రేవంత్ వ్యాఖ్యలకు బిఆర్‌ఎస్ నేతలు ఏ స్థాయిలో కౌంటర్లు ఇస్తారో చూడాలి.