తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల ఆరున అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్ – కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని చేర్పించండని ఆయన లేఖలో కోరారు. రాజకీయ దురుద్ధేశంతో ఈ స్కీంను మీరు అటకెక్కించారన్న ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన ఈ లిఫ్ట్ స్కీం తెలంగాణ హక్కు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని కేఆర్ఎంబీ నా లేఖకు స్పందనగా ప్రత్యుత్తరమిచ్చిందని ఆయన పేర్కోన్నారు.
జలాల కేటాయింపులో ఏడేళ్లుగా మోడీ ఉలకకపోయినా… బీజేపీ ప్రయోజనాల కోసం మీరు పలుకుతూనే ఉన్నారుగా! అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఏపీ కయ్యానికి కాలుదువ్వుతోందంటోన్న మీకు… ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల విషయంలో వియ్యమెందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తుత్తి హూంకరింపులు, గాండ్రింపులు పక్కన పెట్టి కాస్త గట్టిగా మాట్లాడితేనే తెలంగాణ కు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.