తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియాగాంధీ అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. పార్టీలోకి వచ్చిన శ్రీహరి రావుకి సాదర స్వాగతం పలుకుతున్నానని, నిర్మల్ జిల్లా నుంచి కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వారికి సముచిత గౌరవం, స్థానం దక్కుతుందన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ గెలుపు కోసం పనిచేసేవారికి గుర్తింపు లభిస్తుందని, కొందరు పార్టీ వీడితే నాయకులే ఉందన్నట్లు వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు.
ఏ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారో ఆ గ్రామంలో బీఆర్ఎస్ ఓట్లు అడగాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళం అడుగుతామన్నారు. కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదని, తెలంగాణ సమాజం తిరగబడే సమయం అసన్నమైందన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన వారి జాబితాలో శ్రీహరిరావు మొదటి వరుసలో ఉంటారన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పదింట ఎనిమిది గెలుస్తుందన్నారు. తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక తుపాను రానున్నాయన్నారు.
తెలంగాణలో ధరణి పోర్టల్ ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ అనే సంస్థకు అప్పగించారని రేవంత్ ఆరోపించారు. ప్రజల భూముల వివరాలను ప్రయివేటు సంస్థ చేతిలో పెట్టారన్నారు. ధరణి నిర్వహణపై ఐఎల్ఎఫ్ సంస్థతో రూ.150 కోట్లకు ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఐఎల్ఎఫ్ సంస్థకు చెందిన 99 శాతం వాటాను టెరాలసిస్ టెక్నాలజీస్ అనే సంస్థ కొనుగోలు చేసిందన్నారు. 70 లక్షల భూయజమానుల వివరాలను ఐఎల్ఎఫ్ సంస్థకు విక్రయించారని ఆరోపించారు. కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదు అన్నారు రేవంత్ రెడ్డి.