సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో అనూహ్యంగా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య ఇంటికి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
చుక్కా రామయ్య ఆరోగ్యం క్షీణించిందనే సమాచారం మేరకు పరామర్శించేందుకు వెళ్లడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నం వివాదం కావడంతో సచివాలయంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దాదాపు 45 మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సమావేశం తర్వాత రామయ్య ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అఖిలపక్షం నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు, జేఏసీ నేతలు, ఉద్యమకారులు ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు.
కాగా, చుక్కా రామయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు. జనగామ జిల్లా, గూడూరు గ్రామంలో జన్మించిన ఇతను ఐఐటి శిక్షణా కేంద్రం స్థాపించడం కోసం హైదరాబాదుకు వచ్చాడు. ఐఐటీ శిక్షణలో మంచి పేరు సంపాదించి ఐఐటి రామయ్య అని పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాదులోని నల్లకుంటలో ఈ శిక్షణా కేంద్రం ఉంది.