సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో జరిగిన అవకతవకలపై బాద్యులను శిక్షించాలని, ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

“రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు చేయించాం.. గత ఏడాది రామగుండం పరిశ్రమ తిరిగి ప్రారంభించారు.. అయితే అక్కడ ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి దాదాపు 800 మంది నిరుద్యోగుల నుంచి 6 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేసి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చారు. మీకు ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని, అవసరం అనుకుంటే ఆ ఉద్యోగాన్ని వేరే వాళ్లకు అమ్ముకోవచ్చని నమ్మబలికారు. దాదాపు 50 కోట్ల రూపాయలు ఈ ఉద్యోగాల నియామకంలో చేతులు మారాయి. అయితే ఇటీవల రామగుండం ఉద్యోగాల నియామక కాంట్రాక్ట్ మారిపోవడంతో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ గతంలో నియమించిన వారిలో సగం మందిని తొలగించారు.. దీంతో వారంతా ఉద్యమాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ తొలగింపులో తీవ్రంగా మానసిక ఆందోళనకు గురైన కేశవ పట్నం మండలం అమ్మలపురం గ్రామానికి హరీష్ గౌడ్ అనే ఉద్యోగి సెల్ఫీ వీడియో పెట్టి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే రేపు కేసీఆర్ రామగుండం రానున్న నేపథ్యంలో హరీష్ శవానికి రామగుండంలో పోస్టుమార్టం చేయకుండా కరీంనగర్ తరలించి పోస్టుమార్టం చేసి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇన్ని అక్రమాలు అవినీతి జరుగుతున్న కేసీఆర్, కేటీఆర్ లు ఎలాంటి స్పందన లేదు. అవినీతికి పాల్పడితే తన కుటుంబ సభ్యులనైనా జైల్లో వేస్తా అని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఈ విషయంలో ఇంత జరుగుతున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే చర్యలు తీసుకొని మంత్రి కొప్పుల ఈశ్వర్ ను, ఎమ్మెల్యే చందర్ ను భర్తరఫ్ చేయాలి.

ఈ విషయంలో పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రోహిత్, సుజిత్, పైసా రవి, అంజన్ కుమార్ తదితర కాంగ్రెసునాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లో బంధించారు.. వెంటనే వారిని విడుదల చేయాలి.ఉద్యోగాలు తీసేసిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలి. మృతి చెందిన హరీష్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి”. అంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు కొన్ని డిమాండ్లను కూడా ఈ లేఖలో పేర్కొన్నారు.

1. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ లను బర్తరఫ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి విచారన జరపాలి. 2. ఉద్యోగాలు తొలగించిన అందరికి తిరిగి ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. 3. మృతులు హరీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 50 లక్షల నష్టపరిహారాన్ని ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. 4. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, కవ్వం పల్లి సత్యనారాయణ, అది శ్రీను, తదితరులను వెంటనే విడుదల చేయాలి. 5. మొత్తం వ్యవహారం లో కేసీఆర్ స్పందించి సమగ్ర విచారణ చేయాలి. అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version