తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ ‘దిశ’పై నలుగురు అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేయడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్భయ, దిశ ఘటనల ఆధారంగా ‘దిశ’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఇటీవల ప్రకటించారు. ప్రకటించడమే ఆలస్యం ఆ చిత్రానికి సంబంధించిన వర్క్ కూడా మొదలుపెట్టారు స్క్రిప్ట్ ని రూపొందించేందుకు దిశా కేసులో వివరాలపై వర్మ లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
అలాగే ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి సజీవదహనం చేశారని, ఇలాంటి అత్యాచార దోషులు ఏం నేర్చుకుంటున్నారో ‘దిశ’ చిత్రంలో భయంకరమైన గుణపాఠంగా తెలపబోతున్నామంటూ తెలిపాడు. ఇక తాజాగా ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. దిశను ఎక్కడైతే కాల్చి చంపారో.. అక్కడే ఆ చటాన్ పల్లి సమీపంలోనే తొలి షాట్ స్టాట్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ నిర్వహించారు.
శంషాబాద్‌లో అత్యాచారం, హత్య అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి శివారులో దహనం చేసేందుకు లారీలో తీసుకొచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు. అలాగే చటాన్‌పల్లి శివారులో మృతదేహాన్ని కాల్చివేసిన బ్రిడ్జి వద్ద స్కూటీ, లారీతో సన్నివేశాన్ని కూడా చిత్రీకరణ చేశారు. కాగా, వర్మ ఇప్పటికే ఎన్నో బయోపిక్ చిత్రాలని తెరక్కించారు. రక్త చరిత్ర 2 భాగాలు, 26/11, కిల్లింగ్ వీరప్పన్ వంటి సినిమా రూపొందించి సంచలనం క్రియేట్ చేశారు. మరి ప్రస్తుతం వర్మ తెరకెక్కించబోయే దిశ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.