రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణంగా దేశంలో సరికొత్త మార్పు వస్తుందని రాహుల్ బావ, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొంటుండడం, భవిష్యత్తు ఆశా రేఖగా ఆయన్ను చూస్తుండడమే ఇందుకు కారణమని అన్నారు. సాయిబాబా దర్శనం కోసం మహారాష్ట్రలోని షిర్డీకి విచ్చేసిన రాబర్ట్ వాద్రా ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
రాహుల్ ఆలోచనా విధానం అందరూ ఐక్యంగా ఉండాలన్న సాయిబాబా ఆలోచన విధానాన్ని పోలి ఉందని వ్యాఖ్యానించారు. ‘‘రాహుల్, ప్రియాంకా తమ పోరును ఆపరు. మేం ప్రజలతో కలిసి ఉన్నాం. మేం వారికోసం ఐక్యంగా పనిచేస్తాం’’ అని వాద్రా అన్నారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. ఇవాళ 28 కిలోమీటర్లు ఈ యాత్ర సాగనుంది. ఇవాళ సాద్ నగర్ నుంచి మొదలైన రాహుల్ పాదయాత్ర కాసేపటి తర్వాత నందిగామ వద్ద టీ బ్రేక్ తీసుకుంది. కొత్తూరు వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ వెంట పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు.