శ్రీలంకతో జరిగిన మూడు టి20 మ్యాచుల సీరీస్ ని 2-0తో కైవసం చేసుకున్న టీం ఇండియా ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న వన్డే సీరీస్ కి సిద్దమైంది. ఇరు జట్ల మధ్య ముంబై వేదికగా మొదటి వన్డే జరగనుంది. స్వదేశంలోవరుసగా మ్యాచ్ లు గెలిచి దూకుడు మీద ఉన్న టీం ఇండియా ఈ మ్యాచ్ లో గెలిచి ఊపుని కొనసాగించాలని భావిస్తుంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా టీం ఇండియాలో,
కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ముగ్గురు ఓపెనర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ద్వారా ఇండియా-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళలో,
రోహిత్ శర్మ రెండో స్థానానికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సచిన్ టెండూల్కర్ – 71 మ్యాచ్‌ల్లో 44.59 సగటుతో 3077 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉండగా, రికీ పాంటింగ్ – 59 మ్యాచ్‌ల్లో 40.07 సగటుతో 2164 పరుగులు చేయగా రోహిత్ శర్మ 37 మ్యాచ్‌ల్లో 61.72 సగటుతో 2037 పరుగులు చేసాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ – 37 మ్యాచ్‌ల్లో 1727 పరుగులు చేయగా ఎంఎస్ ధోని 55 మ్యాచ్‌ల్లో 1660 పరుగులు చేసాడు. రోహిత్ శర్మ మరో 128 పరుగులు చేస్తే పాంటింగ్ ని దాటి రెండో స్థానానికి వస్తాడు.