ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఓటమికి చాలా మంది చెప్పే కారణం ప్రధాని నరేంద్ర మోడితో విభేదించడమే. ఆయనతో విభేదించిన కారణంగానే తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని ప్రజా వ్యతిరేకత కాదని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. చంద్రబాబు అనవసర శత్రువుతో పోరాటం చేసారని, అనవసరంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి మోడీతో పోరాడి అసలు శత్రువు జగన్ ని లైట్ తీసుకున్నారని,
అందుకే పార్టీ ఆ స్థాయిలో ఓటమి చెందింది అంటూ పలువురు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. దీనిపై తెలుగుదేశం సీనియర్లు కూడా చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలోనే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని నరేంద్ర మోదీతో విభేదించి చంద్రబాబు తప్పుచేశారని మళ్లీ మోదీతో కలవాల్సిన అవసరం ఉందని, దానికోసం సీనియర్లమంతా కలిసి చంద్రబాబుకు చెప్తామని అన్నారు.
త్వరలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలుస్తాయని రాయపాటి కీలక వ్యాఖ్యలు చేసారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. రాజధాని అంశంపై కూడా రాయపాటి మాట్లాడారు. రాజధాని రైతులు, ప్రజలెవరూ అధైర్యపడవద్దని, మూడు రాజధానులు తగదని, కావాలంటే పులివెందులలో రాజధాని పెట్టుకోవాలని, అమరావతి రైతులు తమ పోరాటాన్ని ఆపొద్దని, శ్రుతిమించుతున్న పోలీసుల వైఖరిపై తిరగబడాలని రాయపాటి పిలుపునిచ్చారు.