రాస్‌ టేలర్‌ అరుదైన రికార్డు.. మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌!

-

న్యూజీలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌.. ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20లు, వన్డేలు, టెస్టులు.. ఇలా మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్‌ చేశాడు. శుక్రవారం భారత్‌, న్యూజీలాండ్‌ మధ్య వెల్లింగ్టన్‌లో ప్రారంభమైన తొలి టెస్టుతో టేలర్‌కు ఈ అరుదైన ఘనత దక్కింది.

కాగా, తనకు ఎంతో విశిష్టమైన ఈ టెస్టు మ్యాచ్‌ ప్రారంభం సందర్భంగా రాస్‌ టేలర్‌ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మ్యాచ్‌ మొదలవడానికి ముందు గ్రౌండ్‌లో జరిగే జాతీయ గీతం ఆలపన కోసం తను ఒక్కడే కాకుండా కూతురు మెకంజే, కొడుకు జాంటీలను కూడా వెంటబెట్టుకొచ్చాడు. తండ్రితోపాటు వాళ్లు కూడా జాతీయ గీతాన్ని ఆలపించి క్రికెట్‌ అభిమానులను అలరించారు.

రాస్‌ టేలర్‌ తన కేరీర్‌లో మొత్తం 100 టీ20లు, 231 వన్డేలు ఆడాడు. తాజా టెస్టుతో కలిపి టెస్టుల్లో కూడా 100 మ్యాచ్‌లు ఆడినట్లయింది. దీంతో మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన రికార్డు దక్కించుకున్నాడు టేలర్‌. న్యూజీలాండ్‌ టీమ్‌ తరఫున ఎప్పుడూ పరుగుల వరద పారించే 35 ఏండ్ల టేలర్‌.. 100 టీ20ల్లో 1909, 231 వన్డేల్లో 8,570, 100 టెస్టుల్లో (ప్రస్తుతం జరుగుతున్న టెస్టుతో కలిపి) 7,174 పరుగులు సాధించి తన దేశంలోని గొప్ప క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news