కుళ్లిన కొబ్బరి కాయలతో కోట్లల్లో వ్యాపారం..

-

మన దగ్గర బిజినెస్‌ చేసే ఆలోచన..కష్టపడే మెంటాలిటీ ఉండాలే కానీ.. ఎలాంటి వ్యాపారమేనా చేయొచ్చు.. లాభాలు సంపాదించవచ్చు. కొబ్బరి కాయలతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్పమంటే అందరూ చెప్పేస్తారు.. మరీ అదే కొబ్బరికాయ కుళ్లిపోతే.. ఏం చేస్తారు..? ఇంకేం చేస్తారు డస్ట్‌బిన్‌లో వేస్తాం అనుకుంటారు.. కానీ కుళ్లిన కొబ్బరికాయలతో కోట్లల్లో బిజినెస్‌ చేయొచ్చు తెలుసా..?
కుళ్లిన కురిడీల నుంచి తీసే నూనెను సబ్బుల తయారీలో వినియోగిస్తుంటే.. కుళ్లిన కాయలను కాశీలో శవ దహనాలకు వినియోగిస్తున్నారట. ఒక్క ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే కుళ్లిపోయిన కొబ్బరి కాయలతో రూ.100 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. కొబ్బరి కాయల దింపు సమయంలోను, రాశుల నుంచి కుళ్లిన కొబ్బరి కాయలను ఏరి పక్కన పడేస్తుంటారు. నాణ్యమైన కాయలను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఏరివేసే ప్రక్రియను నాణ్యత పరిశీలకులు చేసేవారు నిర్వహిస్తారు. కొబ్బరి రాశుల నుంచి నూటికి 5 కొబ్బరి కాయలు కుళ్లిపోయినవి వస్తుంటాయి. వీటిని ఏరివేసి పక్కన పడేస్తుంటారు. వీటిని కూడా కొనుగోలు చేసే వ్యాపారులు ప్రత్యేకంగా ఉంటారు. వీరు ఒక్కో కాయకు రూపాయి లేదా రెండు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కుళ్లిన కొబ్బరి కాయలను ప్రాసెసింగ్, రవాణా చార్జీలతో కలిపి ఉత్తరాదిలో ఒక్కో కాయ రూ.8 నుంచి రూ.10కి విక్రయిస్తున్నారు.
కుళ్లిన కొబ్బరి కాయల్లో వచ్చే కొబ్బరి గుజ్జును తీసి నాలుగైదు వారాలపాటు ఎండబెట్టి కొబ్బరి నూనె తీస్తారు. ఇలా తీసిన నూనె కోనసీమలోని అంబాజీపేట కేంద్రంగా వ్యాపారులు సేకరిస్తారు. ఇలా సేకరించిన కుళ్లిన కొబ్బరి నూనెను యానాం, తణుకు, విజయవాడ, పుణె, ముంబై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో సబ్బుల తయారీ పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. టన్నుల కొద్దీ కుళ్లిన కొబ్బరి నూనె అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నూనె కిలో రూ.30 నుంచి రూ.40 చొప్పున అమ్ముడుపోతుంది. కుళ్లిన కొబ్బరి కాయల చిప్పలను పొడి చేసి దోమల నివారణకు వాడే కాయిల్స్‌లో వినియోగిస్తున్నారు. ఈ పౌడర్‌ తణుకు, విజయవాడ రవాణా చేస్తున్నారు. ఈ చిప్పలు టన్ను రూ.5 వేల ధర పలుకుతోంది.

శవ దహనాలకు కుళ్లిన కొబ్బరి కాయలు

కాశీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో శవాల దహనానికి కుళ్లిన కొబ్బరి కాయలను ఎండబెట్టి వినియోగిస్తున్నారు. కుళ్లిన కొబ్బరి కాయలను సంచులలో నింపి లారీల ద్వారా కాశీ, మధుర తదితర క్షేత్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కాశీ వంటి క్షేత్రాల్లో కొబ్బరి కాయలతో అంత్యక్రియలు నిర్వహిస్తే పుణ్యం వస్తుందని ఉత్తరాది రాష్ట్రాల వారి నమ్మకం. ఇందుకు నాణ్యమైన కొబ్బరి కాయలు వినియోగించాలంటే కాయ రూ.20 పైనే ఉంటుంది. అంత ధర భారమనే ఉద్దేశంతో కుళ్లిన కొబ్బరి కాయలను శవ దహనానికి వినియోగిస్తున్నారని గోదావరి జిల్లాల నుంచి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతిచేసే వ్యాపారులు చెబుతున్నారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి రోజుకు మూడు లారీలు అంటే సుమారు లక్ష కాయలు. కాశీకి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతి అవుతున్నాయి. కార్తీక మాసంతో పాటు పూజల సమయాలలో హోమాల నిర్వహణ, మొక్కులు తీర్చుకునే క్రమంలో నదులలో వదిలేందుకు ఉత్తరాది భక్తులు ఈ కొబ్బరి కాయలను బస్తాల కొద్దీ కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇవి రెట్టింపు ధర పలుకుతున్నాయి.
వంద కోట్ల వరకు లావాదేవీలు
కుళ్లిన కొబ్బరి కాయలను ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ఆచంట, అంబాజీపేట, పాశర్లపూడి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఇంకా.. కేరళ, ఒడిశా, తమిళనాడు నుంచి కూడా కుళ్లిన కొబ్బరి కాయలను ఎగుమతి చేస్తుండటంతో గిరాకీ బాగా ఉంది. కుళ్లిన కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, చిప్పలు అన్నీ కలిపి ఉభయ గోదావరి జిల్లాల నుంచి జరిగే లావాదేవీలు ఏటా రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Read more RELATED
Recommended to you

Exit mobile version