RRR : ప్రేక్షకులు జాగ్రత్త.. తెర వద్దకెళ్తే మేకులు దిగిపోతాయ్.. ఎక్కడంటే?

-

తెలుగునాట సినిమా హీరోలకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన కథానాయకుల చిత్రాలు విడుదలయినపుడు అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ హంగామా చూస్తుంటే పండుగ వాతావరణం వచ్చేసిందని అనిపిస్తుంది. ఈ క్రమంలోనే అభిమానులు థియేటర్‌లో వెండితెరపైకి పూలు, పేపర్లు విసురుతూ ఆనందోత్సాహంతో కేరింతలు కొడుతుంటారు. అంతటితో ఆగిపోతే బాగుండేది. కానీ, ఇటీవల ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫిల్మ్ రిలీజ్ సందర్భంగా కొంత మంది అభిమానులు తెరపైన పాలాభిషేకం చేశారు. దాంతో తెరకు మరకలై అది పాడిపోయింది.

అది రిపేర్ చేయించడానికి థియేటర్ యాజమాన్యానికి రూ.15 లక్షలు ఖర్చయింది. ఈ నేపథ్యంలో యజమాని అప్రమత్తమయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదల కాబోతున్న క్రమంలో వెండితెర వద్దకు ఎవరూ రాకుండా ఉండేందుకు పదునైన మేకులతో కూడిన చెక్కలను పెట్టాడు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇలా చేశాడు ఆ టాకీసు ఓనర్. ఏపీలోని విజయవాడ అన్నపూర్ణ థియేటర్‌లో థియేటర్ యాజమాన్యం ఇలా చేసింది. తెర వద్దకు వస్తే మీకు అపాయం జరుగుతుందని హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రేక్షకులు తెర వద్దకు వెళ్లే ముందర జాగ్రత్త వహించడం మంచిది. ఇకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా థియేటర్లలో టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో అయ్యాయి. సినీ అభిమానులు అందరూ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అనే ఆత్రుతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news