దేశంలో రూ. 10 నాణేల వాడుకలో ఉన్నాయి. అయితే వీటిని తీసుకునేందుకు మాత్రం వ్యాపారులు, సామాన్య ప్రజలు ముందుకు రావడం లేదు. ఏదైనా కొనుగోలు నిమిత్తం రూ. 10 నాణేం తీసుకెళ్తే మాకు ఇవి చెల్లవని.. వేరేవి ఇవ్వాలంటూ వ్యాపారులు, సాధారణ ప్రజానీకం కోరుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. కానీ.. తాజాగా ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ నాణేల చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఈ అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. రూ. 10 నాణెం చెల్లుతుందా.. చెల్లదా అని తమిళనాడు ఎంపీ రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై కేంద్రమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వివరణ ఇచ్చారు. దేశంలో రూ.10 నాణాలు చెల్లుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వాటిని ఆర్బీఐ ముద్రించి చెలామణిలో ఉంచిందని వెల్లడించారు. అన్ని లావాదేవీలకు వీటిని వినియోగించవచ్చని ఆయన అన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి సభాముఖంగా వెల్లడించారు.