పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కేంద్రం 2016వ సంవత్సరం నవంబర్ నెలలో రూ.2000 నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఆ నోటును ప్రింట్ చేయడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. సోమవారం లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
మార్చి 30, 2018 వరకు దేశంలో రూ.2000 నోట్లు 3,362 మిలియన్ల సంఖ్యలో ఉండగా ఫిబ్రవరి 26, 2021 వరకు వాటి సంఖ్య 2499 మిలియన్లకు పడిపోయింది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు చెలామణీలో ఉన్న నోట్ల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. కాగా ఏప్రిల్ 2019 నుంచి రూ.2000 నోట్లను ప్రింట్ చేయడం లేదని మంత్రి తెలిపారు.
దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటకు రప్పించాలనే ఉద్దేశంతో అప్పట్లో పెద్ద నోట్లను రద్దు చేశారు. ప్రధాని మోదీ రాత్రికి రాత్రే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తరువాత రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు. అయితే కొత్తగా రూ.500 నోట్లను ప్రింట్ చేసి చెలామణీలోకి తెచ్చారు. కానీ రూ.1000 నోట్లను మాత్రం ముద్రించడం లేదు. ఇక 2 ఏళ్ల నుంచి రూ.2000 నోట్లను ముద్రించడం లేదని కేంద్రం చెప్పడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.