క్విడ్ ప్రోకో గురించి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తెలియనివారుండరు. కొంతకాలం క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఈ పదం అంతగా హల్‌చల్ చేసింది. మళ్లీ ఇప్పుడు దాని అవసరం వచ్చిందేమోననిపిస్తోంది. గుంటూరు నగరపాలక సంస్థలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 57 డివిజన్లకుగాను 44 డివిజన్లు గెలిచి తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అంతవరకు బాగానేవున్నా అసలు కథ ఇప్పటినుంచే ప్రారంభమవుతోంది.
చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకోండి..
దాదాపు 12 సంవత్సరా తర్వాత గుంటూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించింది. వైసీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా కావటి మనోహర్‌నాయుడు, పాదర్తి రమేష్ గాంధీ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెల 18వ తేదీన మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో అప్పటిలోగా మేయర్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. అయితే వైసీపీలో నేతలు ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం కావటి శివనాగ మనోహర్‌నాయుడుకి, మరోవర్గం పాదర్తి రమేష్‌గాంధీకి కొమ్ముకాస్తోంది. వీరిద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో చెరి రెండున్నర సంవత్సరాలు(50-50) పదవీకాలాన్ని పంచుకునేలా ఒప్పందం కుదిరే అవకాశముందని వైసీపీ వర్గాలంటున్నాయి.
టిక్కెట్ కాదన్నందుకు మేయర్‌గా..
వైసీపీ మేయర్ పీఠం కోసం తొలి నుంచి సీనియర్ నాయకుడు కావటి మనోహర్‌నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నాలుగేళ్లు కొనసాగారు. టిక్కెట్ ఖాయమని భావించిన తరుణంలో ఆ టిక్కెట్‌ను నంబూరు శంకరరావుకు కేటాయించారు. ఆ సమయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ వచ్చి మనోహర్‌కి మేయర్‌గా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. తాజాగా 3,837 ఓట్ల భారీ మెజార్టీతో కావటి గెలుపొందారు.
మోపిదేవి అండదండలు
సార్వత్రిక ఎన్నికలకు ముందే పాదర్తి రమేష్‌గాంధీ వైసీపీలో చేరారు. ఆయనకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అండదండలున్నాయి. తనకు రెండున్నర సంవత్సరాల పాటు మేయర్ పదవి ఇస్తామని అందరి నాయకుల సమక్షంలో ప్రకటన చేశారని రమేష్ చెబుతున్నారు. ఆయన 1,037 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇద్దరు నాయకులు పోటీ పడుతుండటంతో వైసీపీ అధిష్టానం చెరి రెండున్నర సంవత్సరాల విధానానికి మొగ్గు చూపుతుందా? లేక గతంలో మనోహర్‌కు ఇచ్చిన హామీని అమలు చేస్తుందా? అనే విషయంలో స్పష్టత రాలేదు. ఒకవేళ చెరి రెండున్నర సంవత్సరాల విధానం అమలు చేసేటట్లయితే మొదటి పర్యాయం మేయర్ పదవి ఎవరికిస్తారనేది ఉత్కంఠగా మారింది. దీంతో మొదటిసారి నేను తీసుకుంటా… అప్పుడు నువ్వు “అవి” తీసుకో… రెండోసారి నువ్వు తీసుకున్నప్పుడు నేను “అవి” తీసుకుంటా అంటూ చర్చలు సాగుతున్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.