కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ ప్రపంచాన్ని అంతలా గడగడలాడిస్తోన్న వ్యాధి మంకీపాక్స్. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. భారత్ లోనూ నాలుగు మంకీపాక్స్ నమోదవ్వడం కలవరం సృష్టిస్తోంది.ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర సర్కార్ లు మంకీపాక్స్ వ్యాప్తి జరగకుండా చర్యలు చేపట్టాయి. అంతే కాకుండా ఈ వైరస్ ను గుర్తించేందుకు పరిశోధనలు కూడా షురూ చేశాయి.
నిమిషాల వ్యవధిలో ఈ వైరస్‌ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ కిట్‌ను అభివృద్ధి చేసినట్లు జీన్స్‌టుమి సంస్థ మంగళవారం ప్రకటించింది. తమ కిట్ అత్యంత కచ్చితత్వంతో 50 నిమిషాల లోపే వైరస్ నిర్ధారణ చేస్తుందని తెలిపింది. ఇది ఆర్టీపీసీఆర్ రూపంలో, పాయింట్ ఆఫ్ కేర్ రూపంలో లభిస్తుందని సంస్థ తెలిపింది. ఈ పాయింట్ ఆఫ్ కేర్ విధానాన్ని ఆసుపత్రులు, విమానాశ్రయాలు, ల్యాబ్స్‌లో ఉపయోగిస్తారని పేర్కొంది. ఇది సింగిల్ ట్యూబ్ మల్టిప్లెక్స్ రియాక్షన్ ఫార్మాట్లో మంకీపాక్స్, చికెన్ పాక్స్ వైరస్ల మధ్య తేడాను గుర్తిస్తుందని చెప్పింది.
ఇదిలా ఉండగా.. పశ్చిమ ఆఫ్రికాలో మొదలై ఒక్కో దేశానికి వ్యాపిస్తున్న మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు అధికమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఈ వైరస్ 75 దేశాలకు వ్యాపించింది. 16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఈ సంఖ్య నాలుగుకు చేరింది. ఒక్క కేరళలోనే మూడు కేసులు రాగా.. దిల్లీలో ఒకరు దీని బారినపడ్డారు. ఇదిలా ఉండగా.. దేశానికి చెందిన మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్.. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ కిట్‌ను రూపొందించినట్లు ఇదివరకే ప్రకటించింది.