ఉదయం లేకగానే ఆ ఊరి గ్రామస్థులంతా గంపలు, గడ్డపారలు, తదితర పనిమూట్లతో వరుసకట్టి వెళ్తుంటారు. ఉపాధి హామీ పనికో, లేక పొలాల పనికో కాదు సుమా.. వారే వెళ్లేది బంగారు, వెండి నాణేలు తవ్వడానికి. మట్టిలో బంగారం నాణేలు దొరుకుతాయంటే ఎవరైనా వదులుతారా‡ మరీ.. అందుకే ఆ గ్రామప్రజలంతా రాత్రి, పగలు తేడా లేకుండా నదితీరంలో తవ్వకాలు చేపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌లో పార్వతీ నది తీరంలో ఓ జాలరికి కొన్ని బంగారు నాణేలు దొరికాయి. రెండు మూడ్రోజలు తర్వాత ఆ విషయం స్థానికులకు తెలవడంతో అప్పటి నుంచి వారంతా నది తీరానికి వెళ్లడం దినచర్యగా పెట్టుకున్నారు.
సెల్‌ఫోన్ వెలుతురులోనూ..
ఐదారు రోజులుగా వందలాది మంది తవ్వుతున్నా కూడా ఏ ఒక్కరికీ నాణెమూ దొరకలేదు. ఆనోటా ఈ నోటా ఆ విషయం పోలీసులకు తెలిసిపోయింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలపై ఆరా తీశారు. ఎవ్వరికీ ఎలాంటి నాణేలు దొరకలేదని ఇకపై తవ్వకాలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల హెచ్చరికలను స్థానికులు పట్టించుకోవడం లేదు. పోలీసులు ఇళ్లకు వెళ్లిన తర్వాత రాత్రి సమయాల్లో సెల్‌ఫోన్ల వెలుతురులో తమ వేట సాగిస్తున్నారు. ఈ విషయం కూడా పసిగట్టిన అ«ధికారులు, పోలీసులు నది తీరంలోనే శిబిరాలు ఏర్పాటు చేసుకొని అటుగా ఎవరైనా వస్తే వారిని అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు.
స్థానికులు వాదన మరోలా..
అసలే కరోనా సమయం.. స్థానికులు ఇలా గుంపులుగా చేరడమేంటని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే.. నదితీరంలో బంగారు, వెండి నాణేలు ఉన్నాయని మాకు నమ్మకం ఉంది. అవి మాకు దక్కరాదనే దురుద్దేశంతోనే అధికారులు, పోలీసులు, మమ్మల్ని అటుగా రాకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. ఈ విషయం మీడియా బృందం వారిని పశ్నించగా.. కొందరు బంగారం రంగులో ఉన్న నాణేలు చూపించి అవి అక్కడే దొరికాయనీ, అవి బంగారు నాణేలే అని అంటున్నారు. అయితే.. అవి అక్కడివేనా అనే సందేహం తలెత్తుతోంది.