ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను రష్యా ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. దానికి స్పూత్‌నిక్ V అని నామకరణం కూడా చేసింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన కుమార్తెల్లో ఒకరికి వ్యాక్సిన్ ఇచ్చామని, ఆమె ఆరోగ్యంగానే ఉందని పుతిన్ తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్‌పై అక్కడి వైద్యుల్లోనే అనేక సందేహాలు, భయాలు నెలకొన్నాయి. తాజాగా చేపట్టిన సర్వేలో సగం వరకు అక్కడి డాక్టర్లు వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు సిద్ధంగా లేరని వెల్లడైంది.
డాక్టర్స్ హ్యాండ్‌బుక్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా రష్యాలోని 3040 మంది వైద్య నిపుణులను సర్వే చేశారు. సర్వేలో 52 శాతం మంది డాక్టర్లు వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని తెలిపారు. కేవలం 24.5 శాతం మంది వైద్యులు మాత్రమే వ్యాక్సిన్ తమకు ఓకేనని తెలిపారు. ఇక 1/5వ వంతు వైద్యులు మాత్రమే వ్యాక్సిన్‌ను ప్రజలకు పంపిణీ చేసేందుకు ఓకే చెప్పారు. అందువల్ల అక్కడి వైద్యులే తమ వ్యాక్సిన్‌కు భయ పడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
నిజానికి రష్యా కరోనా వ్యాక్సిన్‌పై అటు ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు దాదాపుగా ప్రపంచదేశాలన్నీ అనుమానం వ్యక్తం చేశాయి. వైద్య నిపుణులు కూడా వ్యాక్సిన్ సేఫ్టీపై సందేహాలను వ్యక్తపరిచారు. కేవలం 76 మందిపై ట్రయల్స్ నిర్వహించి ఆ ట్రయల్స్ ఫలితాలను బయట పెట్టకుండా నేరుగా వ్యాక్సిన్‌ను రిలీజ్ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రష్యా వ్యాక్సిన్ సురక్షితమా.. కాదా.. అనే విషయం తేలాలంటే మరికొద్ది రోజుల పాటు ఆగాల్సిందే.