అమెరికా సారథ్యంలోని నాటో హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ లోని నాలుగు భూభాగాలను తమ దేశంలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను ప్రజాభిప్రాయం మేరకు అధికారికంగా ఇవాళ తమ దేశంలో కలిపేసుకుంటున్నట్టు రష్యా ప్రకటించింది. ఇవాళ క్రెమ్లిన్ సెయింట్ జార్జ్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల రష్యా అనుకూల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకం చేస్తారని అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్లోని దొనెత్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను అధికారికంగా రష్యాలో విలీనం చేసుకునే కార్యక్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని అధికార ప్రతినిధి డిమిత్ర పెస్కోవ్ తెలిపారు. క్రెమ్లిన్ సెయింట్ జార్జ్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల రష్యా అనుకూల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకం చేస్తారని పెస్కోవ్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. రష్యా వ్యతిరేక దేశాలు ఆంక్షల కత్తికి పదును పెడుతున్నాయి. శుక్రవారం నుంచి రష్యన్ పర్యటకులను తమ దేశంలోకి రాకుండా నిషేధిస్తామని ఫిన్లాండ్ ప్రకటించింది.