తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు బంధు డబ్బులపై కీలక నిర్ణయం

-

నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రైతుబంధు నిధుల జమపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. యాసంగి పంటల సాగు కోసం రూ.8వేల కోట్ల మేరకు నిధులను జనవరి మొదటివారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే పేదలకు ఇళ్ల నిర్మాణ పథకానికి రూ. 3లక్షల సాయం అందించడంపై మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను CM ఆదేశించారు. అటు పోడు భూములపై సర్వే పూర్తయ్యాకే పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే..
రాష్ట్రంలో కొనసాగుతున్న కొలువుల కుంభమేళాలో మరో ఏడువేల కొత్త పోస్టులు వచ్చి చేరాయి. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా, తాజాగా మరో 7,029 పోస్టులనూ వాటికి జతచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం పలుశాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.

డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా పోలీస్‌శాఖను మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించింది. వివిధ విభాగాల్లో 3,966 పోస్టులను భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కొత్త పోలీస్‌స్టేషన్లు, సర్కిళ్లు, డివిజన్లను ఏర్పాటు చేయడానికి క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఆర్‌అండ్‌బీ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఆ శాఖలో 472 పోస్టుల భర్తీతోపాటు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో 2,591 నూతన ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర క్యాబినెట్‌ శనివారం ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్‌ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్‌ పాఠశాలలల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ విభాగాల్లో అవసరమైన మేరకు నూతన నియామకాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version