మాండూస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచి, సహాయ సహకారాలు అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ధాన్యం, ఇతర పంటలను రైతులు కాపాడుకునేలా ప్రభుత్వం సాయం చేయాలని సూచించారు. అటు తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చంద్రబాబు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రజలు సమస్యలతో నిరాశానిస్పృహలతో ఉంటే.. వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టకుండా, తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా ప్రకటనలు చేస్తోందని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలవాలి, కలపాలి అంటూ ప్రజలను గందరగోళంలోకి నెడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. ఈ మేరకు శనివారం వరుస ట్వీట్లు చేశారు చంద్రబాబు.
‘‘ఏపీలో అన్నదాతల ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకరం. వ్యవసాయరంగ వృద్ధిలో,ఆక్వా ఎగుమతుల్లో నాడు రికార్డులు సృష్టించిన రాష్ట్రం.. ఇప్పుడు మూడేళ్లలో 1,673 రైతు ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్‌గా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు రైతులను అప్పులపాలు చేస్తున్నాయి మద్దతు ధర లేకపోవడం, వ్యవసాయ సబ్సిడీలు నిలిచిపోవడం వంటివి అన్నదాతల బలవన్మరణాలకు కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ టెర్రరిజం తీరుతో ప్రజలపై వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి. దీంతో నిస్పృహకు గురైన సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్నారు.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు