శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడంపై కేరళలో చెలరేగిన ఆందోళనలు ఇంకా శాంతించలేదు. పలు హిందూ సంస్థలు చేపట్టిన ఆందోళనలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. విచక్షణ రహితంగా ఇతరులపై దాడి చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంశం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇప్పటికే 1800 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.
కన్నూర్‌లోని ఇరిత్తి ప్రాంతంలో సీపీఎం పార్టీకి చెందిన కార్యకర్తపై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొందరు ఆందోళనకారులు దాడికి దిగి కత్తితో పొడిచారు.
ఎమ్మెల్యే ఏఎన్ షంషీర్ ఇంటిపై ఒక్క సారిగా గుంపుగా వెళ్లి దాడికి పాల్పడ్డారు. తలస్సెరీ ప్రాంతంలో భాజపా ఎంపీ వి. మురళీధరన్ నివాసంపై బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఎవ్వరికి ఏమీ జరగలేదు. అయితే శనివారం తెల్లవారుజామున స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ప్రధాని మోదీ ఈ నెల 6న పథనంథిట్టకు రావాల్సి ఉండగా ఈ ఆందోళనల నేపథ్యంలో పర్యటన వాయిదా పడింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని ఏపీ, తెలంగాణలోనూ వ్యతిరేకిస్తూ పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.