దీపావళి మరుసటి రోజు హైదరాబాద్ మరో ఉత్సవానికి వేదిక అవుతుంది. ప్రతీ ఏడు దీపావళి మరుసటి రోజు హైదరాబాద్ లో అట్టహాసంగా సదర్ ఉత్సవాలు జరుగుతాయి. సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతులు నిలుస్తున్నాయి. సదర్ ఉత్సవాల్లో దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించడం చూపరులను ఆకట్టుకుంటాయి. యాదవులు ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని ,నారాయణగూడ, ఖైరతాబాద్, కాచిగూడ, సైదాబాద్, బోయిన్‌పల్లి, ఈస్ట్ మారేడ్ పల్లి, చప్పల్ బజార్, మధురాపురి, కార్వాన్, నార్సింగ్, ఓల్డ్ సిటీ, మరికొన్ని ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు జరగనున్నాయి.
సదర్ ఉత్సవాలకు యాదవులు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి మేలురకమైన, బలిష్టమైన దున్నపోతులను తీసుకువస్తారు. ఉత్సవాలకు ముందుగానే ఇలా తీసుకువచ్చిన దున్నపోతులకు డ్రైఫ్రూట్స్, పాలు, అరటిపండ్లు మొదలైన పౌష్టికరమైన ఆహరాన్ని అందిస్తారు. దున్నపోతుల శరీరంపై వెంట్రుకలను కత్తిరించి, ఆవ నూనెను ఒళ్లంతా పట్టించి నిగనిగలాడేలా తయారు చేస్తారు. 1946 లో మొదలైన సదర్ ఉత్సవాలు క్రమంగా హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు కూడా వ్యాపిస్తున్నాయి.