ఉపఎన్నిక జానారెడ్డికి సవాలేనా ?

-

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక గురించి చర్చ మొదలైనప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన మనసులో మాట బయటకు రాకుముందే అనేక కథనాలు ఆయన చుట్టూ అల్లుకుపోతున్నాయి. ఇదిగో ఆఫర్‌ అంటే.. అదిగో పదవి అన్నట్టు ఉంది ప్రచారాల జోరు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి చుట్టూ ఇప్పుడు రాజకీయ నీలి నీడలు అలుముకున్నాయి.

కాంగ్రెస్‌లోనే కాదు.. అధికార టీఆర్‌ఎస్ నాయకులు కూడా జానారెడ్డిని గౌరవంగానే చూస్తారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పెద్దలు అని సంభోదించేవారు సీఎం కేసీఆర్‌. తర్వాతి కాలంలో జానారెడ్డిని అంతా పెద్దలు అని పిలవడం అలవాటు చేసుకున్నారు. 2018ఎన్నికల్లో నాగార్జునసాగర్‌ నుంచి ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్‌గానే ఉంటున్నారాయన. ఆ ఎన్నికల్లో గెలిచిన నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్‌లో బైఎలక్షన్‌ రానుంది.

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో జానారెడ్డికి.. లేకపోతే ఆయన సూచించిన వారికి టికెట్‌ ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్‌లో ఉంది. ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి బరిలో దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌, బీజేపీలు రఘువీర్‌రెడ్డితో టచ్‌లోకి వెళ్లాయి. రాజకీయాల్లో జానారెడ్డి పెద్దమనిషి కావడంతో ఆ గౌరవానికి భంగం కలగకుండానే సంప్రదింపులు చేస్తున్నాయట. కాకపోతే.. ఆయన రాజకీయ విజ్ఞత ముందు టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రయత్నాలు ఎంత వరకు ఫలితాస్తాయన్నదే ప్రశ్న. ఇదే సమయంలో తాను కాంగ్రెస్‌ను వీడేది లేదని స్పష్టత ఇచ్చేశారు జానారెడ్డి.

తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్‌ ఎంపిక ప్రక్రియ కోసం హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జానారెడ్డి. ఆ సందర్భంగా తాను కాంగ్రెస్‌ను వీడటం లేదని ఠాగూర్‌కు చెప్పేశారు. అంతేకాదు.. 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిని నేనే.. అలాంటప్పుడు పార్టీ ఎలా మారతా అని కామెంట్స్‌ చేశారట. మరింత స్పష్టత కోసం పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం జానారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారట. ఆ సందర్భంలోనూ తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారట. అయితే ఉపఎన్నికలో పోటీ చేస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గానే ఉందని అనుకుంటున్నారు.

ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచనలో జానారెడ్డి లేరని గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఒకవేళ గెలిస్తే ఎమ్మెల్యే గిరి రెండేళ్లే ఉంటుంది. రెండేళ్ల తర్వాత మళ్లీ పోటీ చేయాలి. ఈ వయసులో ఎనర్జీ వృథా చేసుకోవడం ఎందుకు అన్నది జానారెడ్డి ఆలోచనగా ఉందట. బైఎలక్షన్‌లో ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి బరిలో ఉంటారని సమాచారం. గాంధీభవన్‌లో పార్టీ నేతలతో జరిగిన ఇష్ఠాగోష్టిలోనూ ఆయన ఇదే చెప్పారట.

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు లైఫ్‌ అండ్ డెత్‌ సమస్య. అలాగే జానారెడ్డికి కూడా ఇది ఓ సవాల్‌గా భావిస్తున్నారట. జానారెడ్డి స్వయంగా బరిలో ఉంటే చాలా ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ కుమారుడిని బరిలో దించితే ఆ స్థానాన్ని నిలబెట్టుకునేలా విజయం సాధించాలి. మరి.. రాజకీయాలలో అనేక వ్యూహాలు ఎత్తుగడలు వేయడంలో ఆరితేరిన జానారెడ్డి ఉపఎన్నికలో ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version