సాగర్ బైపోల్: మళ్లీ తెర పైకి నోముల కుటుంబం

-

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పై రోజుకో చర్చ తెరపైకి వస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సెంటిమెంట్‌ వర్కవుట్ కాలేదు. దీంతో నాగార్జునసాగర్‌ బై ఎలక్షన్‌లో నోముల కుటుంబానికి టికెట్‌ ఇవ్వాలా వద్దా అన్నదానిపై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఓ పక్క మల్లగుల్లాలు పడుతుంది. ఇక్కడ నోముల కుటుంబానికి టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ పై వచ్చే విమర్శల మాటేంటి.. రెడ్డి సామాజికవర్గానికో న్యాయం..బీసీలకు మరో న్యాయమా అనే విమర్శలు ఇలా పార్టీ వర్గాల్లో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ పరిణామంతో మళ్లీ టిక్కెట్ రేసులో నోముల ఫ్యామిలీ తెర పైకి వచ్చింది…టికెట్‌ ఇవ్వలేకపోతే నోముల కుటుంబాన్ని పార్టీ ఏ విధంగా బుజ్జగిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సాగర్ ఉపఎన్నికల్లో అభ్యర్థిపై టీఆర్‌ఎస్‌లో తీవ్రస్థాయిలో వడపోతలు నడుస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన ముందు నోముల కుటుంబం బలం సరిపోతుందా? లేక మరో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలా అని అంతర్గతంగా సర్వే జరుగుతోందట. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, పార్టీ నేత కోటిరెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది. జానారెడ్డికి మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అయితే సరైన నేత అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. అయితే పార్టీ నుంచి తనకెలాంటి ప్రతిపాదనలు రాలేదు.. అలాగే తనకు పోటీ చేయాలన్న ఇంట్రస్ట్‌ లేదని గుత్తా చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే నోముల నర్సింహయ్య కుటుంబం తమకే టికెట్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠాన్ని కోరుతోందట. నర్సింహయ్య భార్య లక్ష్మి, కొడుకు భగత్‌లు పోటీకి రెడీగా ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. భగత్‌ అడ్వకేట్‌ కావడం.. నియోజకవర్గంలో యాదవుల ఓట్లు 40 వేలకు పైగా ఉండటంతో సానుభూతి కలిసి వస్తుందని పార్టీ పెద్దలకు వెల్లడిస్తున్నారట. పలు యాదవ సంఘాలు సైతం నోముల కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలని తీర్మానిస్తున్నాయట. ఎమ్మెల్యేలు అంజయ్య, జైపాల్‌ యాదవ్‌, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌లు నోముల సంతాప సభలో ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. దీంతో తమకే టికెట్ ఇస్తారని బలంగా విశ్వసిస్తోందట నోముల కుటుంబం.

నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై కసరత్తు జరుగుతున్న సమయంలోనే పార్టీ వర్గాలలో మరో చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి బరిలో దిగితే మాత్రం నోముల కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇవ్వబోరని అనుకుంటున్నారట. వారికేదైనా నామినేటెడ్‌ పదవి ఇచ్చి బుజ్జగిస్తుందని.. అలాగే బలమైన అభ్యర్థిని బరిలో దించి కొత్త సమీకరణాలను తెరపైకి తెస్తుందని భావిస్తున్నారట. మరి ఈ వడపోతల రాజకీయంలో చివరికి ఎవరు టికెట్‌ దక్కించుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version