కింద ఇచ్చిన చిత్రంలోని కోడిగుడ్డు, నూడుల్స్‌ను చూశారు కదా. ఎవరూ పట్టుకోకుండానే అవి గాల్లో అలా ఉన్నాయేంటబ్బా ? ఆ ఫొటోను మార్ఫింగ్ కానీ చేయలేదు కదా ? అని అనుమానిస్తున్నారా ? అయితే మీ అనుమానం నిజమే. కానీ ఆ ఫొటోను మార్ఫింగ్ మాత్రం చేయలేదు. అయితే మరి ఆ రెండూ గాల్లో అలా ఎలా ఉన్నాయి ? అని సందేహం కలగవచ్చు. ఏమీ లేదండీ.. అదంతా చలి మాయ..
సైబీరియాలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం చలి కాలం కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ఓలెగ్ అనే ఓ ట్విట్టర్ యూజర్ ఆ కోడిగుడ్డు, నూడుల్స్ ను పైకి పెట్టి అలాగే పట్టుకున్నాడు. దీంతో అవి చలికి గడ్డకట్టాయి. తరువాత వాటిని విడిచిపెట్టాడు. ఈ క్రమంలో గడ్డ కట్టిన ఆ రెండు పదార్థాలు అలాగే గాల్లో ఉన్నాయి. అయితే దాన్ని చూసి చాలా మంది షాకవుతున్నారు. ఆ రెండూ గాల్లో అలా ఎలా ఉన్నాయబ్బా అని సందేహించడం మొదలు పెట్టారు. కానీ నిజానికి అవి గడ్డకట్టాయి. అందువల్లే గాల్లో అవి అలా ఉండగలుగుతున్నాయి.
సైబీరియాలోని నోవోసిబిర్‌స్క్ అనే ప్రాంతంలో గత కొద్ది రోజులుగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తాజాగా అక్కడ -45 డిగ్రీల సెల్సియస్‌కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో సదరు యూజర్ ఆ పనిచేశాడు. అనంతరం వాటి ఫొటోను క్లిక్‌మనిపించి దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ పోస్టుకు 14,500కు పైగా లైక్‌లు వచ్చాయి. దాన్ని 3500 మందికి పైగా రీట్వీట్ చేశారు. కాగా మనకు ఇక్కడ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలు ఉంటేనే చలికి తట్టుకోలేకపోతున్నాం, అలాంటిది వారు అన్ని మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద ఎలా జీవిస్తున్నారో కదా, తలచుకుంటేనే భయం వేస్తుంది.