షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధమని సంస్థాన్ బోర్డు తెలిపింది. ఆలయం యధావిధిగా తెరిచేఉంటుందని, అన్ని సేవలు నియమనిబంధనల ప్రకారం జరుగుతూనేఉంటాయని స్పష్టం చేసింది.
షిర్డీ సాయిబాబా జన్మస్థలం మీద జరుగుతున్న రగడ దృష్ట్యా, షిర్డీలోని ప్రఖ్యాత ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, షిర్డీ సాయిబాబా సంస్థాన్ బోర్డు వాటిని ఖండించింది.
సాయిబాబా ఆలయం మూసేయడం అనేది అసలు లేనే లేదని, అదంతా తప్పుడు ప్రచారమని బోర్డు తెలిపింది. మహరాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మీద కేవలం నిరసన మాత్రమే తెలిపామని ఆలయ మూసివేత ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని బోర్డు ప్రతినిధి తేల్చిచెప్పారు. సాయిబాబా దర్శనం, ప్రసాద వితరణ, రూముల కేటాయింపు యధావిధిగా ఉంటాయని తెలిపిన ఆయన, ఆదివారం నుండి షిర్డీ పట్టణ బంద్‌కు ఎన్సీపీ పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు.
సాయిబాబా జన్మస్థలం పర్భణీ జిల్లాలోని పత్రి అని మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ గ్రామ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయం పట్ల షిర్డీ పట్టణ వాసులు, సంస్థాన్ బోర్డు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన తెలిపాయి. ఇది షిర్డీ ప్రాముఖ్యతను తగ్గించే కుట్ర అని వారు ఆరోపించారు. ప్రతీ సంవత్సరం కోట్లాదిమంది భక్తులు దేశవ్యాప్తంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకుంటారని, వారి భక్తిని, నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేయకూడదని షిర్డీవాసుల అభిప్రాయం. షిర్డీలోని పవిత్ర సాయిబాబా ఆలయాన్ని పర్బణీకి తరలించే కుట్ర ఇదని వారి ఆరోపణ. పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీకి ప్రాముఖ్యత తగ్గిపోయి, భక్తుల రాక కూడా తగ్గుతుందని గ్రామస్థుల ఆందోళన.
నిజానికి షిర్డీకి 275 కి.మీల దూరంలోని పర్భణీ జిల్లా, పత్రి గ్రామం, సాయిబాబా స్వంత ఊరు అన్న వాదన చాలా ఏళ్ల క్రితం నుంచే ఉంది. తర్వాత ఆయన 16 యేళ్ల వయసులో షిర్డీకి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతుంటారు.