పండుగకు ఊరికి వెళ్లి ఓ మూడు నాలుగు రోజులు ఊళ్లో గడిపి సరదాగా ఫ్యామిలీతో ఉండి… పండుగకు ఎంజాయ్ చేసి రావాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ.. అదే ఇప్పుడు కొంప ముంచేస్తోంది. పండుగల సమయాల్లో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు వెళ్లడం గగనంగా మారుతోంది.
ఒక్క సంక్రాంతి పండుగే కాదు.. ఏ పండుగకైనా రైళ్లు, బస్సులు, ట్రావెల్స్, ఇతర ప్రైవేటు వాహనాలను ముట్టుకునేటట్టు లేదు. అటు చార్జీలు పెంచుడు.. మరోవైపు రద్దీ.. సామాన్య ప్రజలకు అందనంత దూరంగా ఉంటున్నాయి. పోనీ.. ఎలాగోలా వెళ్దామంటే రద్దీకి తోడు.. చార్జీలు విపరీతంగా పెంచడం పండుగకు వెళ్లే ప్రయాణికులకు అదనపు బారం అవుతున్నాయి.
సరదగా ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేసే అవకాశం లేకుండా.. ఫుట్ బోర్ట్ మీద నిలబడి… ప్రాణాలకు తెగించి ప్రయాణం చేయాల్సి వస్తోంది ప్రయాణికులకు. రైళ్లలో కాలు పెట్టే పరిస్థితి లేదు. మరోవైపు బస్సులు కూడా అంతే. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు డబుల్ చార్జీలను వసూలు చేస్తున్నప్పటికీ లోపల కాలు పెట్టే పరిస్థితి లేదు.
మరోవైపు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వాళ్లకు రోడ్ల మీద ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. టోల్ ప్లాజాల వద్ద విపరీతంగా వాహనాలు ఆగిపోవడంతో.. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ప్రైవేటు వాహనాల్లో వెళ్లే వాళ్లు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు పొగ మంచు వల్ల కూడా వాహనాలు రోడ్ల మీద కదల్లేని పరిస్థితి ఏర్పడుతోంది.