సంక్రాంతి పండుగ ఎప్పుడనే విషయంలో ప్రతి ఏటా ఏదో ఒక గందరగోళం తలెత్తుతూనే ఉంది. ఈ ఏడాది కూడ క్యాలెండర్లలో ఉన్న తేడాలు, ప్రభుత్వ సెలవుల మధ్య వైరుధ్యం చూసి సామాన్య ప్రజలు 14నా లేక 15నా అని అయోమయానికి గురవుతున్నారు. అయితే, పండుగను ఆచారబద్ధంగా ఎప్పుడు జరుపుకోవాలో స్పష్టమైన అవగాహన ఉంటే ఈ సందేహాలకు సమాధానం దొరుకుతుంది. పండితుల అభిప్రాయం ప్రకారం ఖచ్చితమైన సమాచారం తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనూరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’గా పరిగణిస్తారు. ఈ ఏడాది జనవరి 14, బుధవారం రోజే సూర్యుడు మకర సంక్రమణం జరుగుతున్నందున, అదే రోజున సంక్రాంతి పండుగను జరుపుకోవాలని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం సైతం ఇదే లెక్కను అనుసరించి 14వ తేదీనే సెలవు ప్రకటించింది. సాధారణంగా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారే క్రమాన్ని బట్టే పండుగ తిథిని నిర్ణయిస్తారు కాబట్టి, శాస్త్రోక్తంగా 14వ తేదీయే అసలైన పండుగ రోజు అని మనం గ్రహించాలి.
మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జనవరి 15న అధికారిక సెలవు ప్రకటించడంతో ప్రజల్లో గందరగోళం పెరిగింది. తిథి ప్రభావం లేదా ప్రాంతీయ ఆచారాల రీత్యా కొన్ని క్యాలెండర్లు 15వ తేదీని సూచిస్తున్నప్పటికీ సంక్రమణం జరిగిన మరుసటి రోజును కూడా పండుగ వాతావరణంలో భాగంగా చూస్తారు.
ఏది ఏమైనా భోగి మంటలతో మొదలై, మకర సంక్రాంతి పుణ్యకాల స్నానాలు, ఆపై కనుమ సంబరాలతో మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పెద్ద పండుగ మన సంస్కృతికి నిదర్శనం. కాబట్టి శాస్త్రం ప్రకారం 14న సంక్రాంతిని, 15న కనుమను జరుపుకోవడం ఉత్తమం.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం జ్యోతిష్య పండితుల అభిప్రాయాలు మరియు పంచాంగ గణనల ఆధారంగా ఇవ్వబడింది. మీ ప్రాంతీయ ఆచారాలను బట్టి పండుగను జరుపుకోవచ్చు.
