సత్య నాదెళ్ల.. మన తెలుగువాడు.. ఓ బహుళ జాతీయ కంపెనీకి సీఈవోగా ఉన్నవాడు. తెలుగోడి సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన వాడు.. ఇప్పుడు ఈ సత్య నాదెళ్ల మరో సంచలన రికార్డు సాధించాడు. కొన్నేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎన్నికై సత్య నాదెళ్ల తెలుగు వారికి గర్వ కారణం అయ్యాడు. అప్పటి నుంచి ఆ సంస్థను ఉన్నత పథంలో నడిపిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.
అలాంటి సత్యనాదెళ్ల తాజాగా ఫార్చూన్ వెల్లడించిన బిజినెస్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్-2019 జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈవోలు, అధినేతలను తలదన్ని అందరికంటే ముందు నిలిచాడు. అత్యుత్తమ లక్ష్యాలు సాధించి అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొన్న వారికి ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. వినూత్న పరిష్కారాలు కనుగొన్న 20 మంది అత్యుత్తమ వ్యాపారవేత్తలను ఈ జాబితాకు ఎంపిక చేస్తుంది ఫార్చూన్ సంస్థ.
తమ కంపెనీల వాటాదార్లకు అందిన ప్రతిఫలాలు, కంపెనీ మూలధనం, దానిపై వచ్చిన రిటర్న్స్ ఇలా అనేక అంశాలను ఈ ఎంపికలో పరిశీలిస్తారు. మొత్తం 10 ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితాలో సత్య నాదెళ్లతో పాటు మరికొందరు భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరంటే.. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా, అరిస్టా అధిపతి జయశ్రీ ఉల్లాల్. బంగా 8వ స్థానంలో; ఉల్లాల్ 18వ స్థానంలోను ఉన్నారు.
సత్యా నాదెళ్ల నాయకత్వ లక్షణాలను ఫార్చూన్ సంస్థ ప్రశంసించింది. 2014లో మైక్రోసాఫ్ట్ అధిపతిగా ఈయనను నియమించినపుడు అంతా ఆశ్చర్యపోయారని.. కానీ ఆయన అందరి అంచనాలను తలకిందులు చేశారని మెచ్చుకుంది. తన కెరీర్ లో ఆర్థిక విభాగంలో పనిచేయకపోయినా అద్భుతమైన నాయకత్వంతో కంపెనీని ముందుండి నడిపించారని ఫార్చూన్ ప్రశంసల వర్షం కురిపించింది.