ప్రజల డబ్బును దోచేయడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. సమాజంలో ఎప్పటికప్పుడు ఏర్పడే పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజలను మాయ చేసి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా కోవిడ్ 19 నేపథ్యంలో నేరగాళ్లు కొత్త పద్ధతిలో డబ్బులు కాజేస్తున్నారు. ఆ వైరస్ టెస్టుల పేరు చెప్పి ప్రజలను సైబర్ ఉచ్చులోకి లాగుతున్నారు. వారి వలలో పడ్డ బాధితులను నిలువునా అందిన కాడికి దోచుకుంటున్నారు.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు తాజాగా నూతన తరహా సైబర్ మోసాలపై హెచ్చరికలు జారీ చేసింది. ఉచిత కోవిడ్ 19 టెస్ట్ పేరిట ఏదైనా ఈ-మెయిల్ వస్తే దాన్ని క్లిక్ చేయవద్దని సూచించింది. పొరపాటున ఆ లింక్‌లను క్లిక్ చేసినా సైబర్ దాడికి లోనయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
జూన్ 21 నుంచి దేశంలోని పెద్ద నగరాల్లో సైబర్ ఎటాక్స్ జరగబోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్‌బీఐ తన ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. జూన్ 21 నుంచి సైబర్ నేరస్థులు ఫిషింగ్ అటాక్ క్యాంపెయిన్ నిర్వహించవచ్చని CERT-In నుంచి తమకు నివేదిక వచ్చిందని ఎస్‌బీఐ తెలియజేసింది. ఈ క్రమంలోనే మోసగాళ్లు ncov2019@gov.in అనే ఐడీ నుంచి మెయిల్స్ పంపుతున్నారని తెలిపింది.
ఇక ఆ మెయిల్స్‌లో సబ్జెక్ట్ లైన్‌లో ఫ్రీ కోవిడ్ 19 టెస్టింగ్ (Free COVID-19 testing) అని ఉంటుందని, దీంతో అందులో ఉండే లింక్‌లను సహజంగానే ఎవరైనా క్లిక్ చేసేందుకు అవకాశం ఉంటుందని, కనుక అలాంటి మెయిల్స్ ఎవరికైనా వస్తే.. వాటిని వెంటనే డిలీట్ చేయాలని, వాటిల్లో ఉండే లింక్‌లను ఎట్టి పరిస్థితిలోనూ క్లిక్ చేయవద్దని ఎస్‌బీఐ హెచ్చరించింది. ఇలాంటి మెయిల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్‌లలో ఉండే ప్రజలు ఇలాంటి మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ సూచించింది.