కాలం చెల్లిన డొక్కు బస్సును నడపడం వల్లే కొండగట్టు ప్రమాదం..?

-

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 54 మంది మృతి చెందిన విషయం విదితమే. తొలుత ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే చనిపోగా క్షతగాత్రులకు హాస్పిటళ్లలో వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. కాగా కొండగట్టు ప్రమాదానికి ఆర్‌టీసీ డొక్కు బస్సే కారణమని తెలుస్తోంది.

బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఆలయ మార్గంలో ఉన్న ఓ వ్యక్తి ప్రత్యక్షంగా ప్రమాదాన్ని చూసినట్లు ఆ వ్యక్తి ఓ మీడియా చానల్‌కు తెలిపాడు. బస్సు ఉదయం 11 గంటల సమయంలో వేగంగా వెళ్తూ రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టిందని, అయితే బ్రేకులు విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ఆ వ్యక్తి మీడియాకు వివరించాడు.

కాగా కొండగట్టు ప్రమాదం జరిగిన ఆర్‌టీసీ బస్సు కాలం చెల్లినదని కూడా తెలిసింది. సాధారణంగా ఆర్‌టీసీలో 14 లక్షల కిలోమీటర్ల దూరం తిరిగిన బస్సును స్క్రాప్ చేస్తారు. దీంతో ఇక ఆ బస్సు మళ్లీ రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఉండదు. కానీ ప్రమాదం జరిగిన బస్సు ఇప్పటికే 14.95 లక్షల కిలోమీటర్లు తిరిగినట్లు సమాచారం. ఇక ఆ బస్సుకు అక్టోబర్ 3వ తేదీన ఫిట్‌నెస్ నిర్వహించాలని షెడ్యూల్‌లో ఉందట. ఈ క్రమంలో కాలం చెల్లిన డొక్కు బస్సు వల్లే ఆ ఘోర ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు అంచనాకు వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version