బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దోషుల విడుదలను సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన ధర్మాసనం.. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రెమిషన్​ మంజూరు చేయడానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్​ 18లోగా సిద్ధం చేసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గుజరాత్ అల్లర్ల వేళ సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో.. దోషులైన 11 మందిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్​ కేఎం జోసేఫ్​, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఏప్రిల్​ 18కి వాయిదా వేసింది. ఈ కేసు భావోద్వేగాలతో కాకుండా, చట్ట ప్రకారం విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

2002లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై అత్యాచారం చేశారు దుండగులు. అనంతరం ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసుపై విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. 2008 జనవరి 21న 11 మందికి జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంను ఆశ్రయించగా.. దీనిని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ ప్రభుత్వం దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేయగా కోర్టు అనుమతించడంతో గతేడాది ఆగష్టు 15న గోధ్రా సబ్​ జైలు నుంచి 11 మంది దోషులు విడుదల అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news