కొత్తగా వచ్చిన సినిమాలు ,వెబ్ సిరీస్లు చూడాలంటే మనలో చాలా మందికి గుర్తుకు వచ్చేది టెలిగ్రామ్ మాత్రమే. ఓటిటి లో విడుదల అయిన వెంటనే సబ్ స్క్రిప్షన్ లేకపోయినా టెలిగ్రామ్ లో ప్రత్యక్షమవుతుంది. దీంతో చాలామంది ఎడాపెడా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవుతున్నారు. వీరి ఆసక్తి ఆసరా తీసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
టెలిగ్రామ్ యాప్ సెర్చ్ బాక్సులో ఏదైనా చిత్రం పేరు టైప్ చేస్తే అందులో ఆ చిత్రానికి సంబంధించిన పలు లింకులు కనబడతాయి. ఈ డౌన్లోడ్ లింకులపై క్లిక్ చేయగానే ఫ్రీగా సినిమాలను చూడాలంటే కొత్త యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని కొన్ని గ్రూప్స్ సూచిస్తాయి. ఒకవేళ ఈ డౌన్లోడ్ లింక్ లపై క్లిక్ చేసి యాప్ ను ఇన్స్టాల్ చేసుకుంటే మన వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడినట్లే. సినిమా పేరుతో లింకులు క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్ లలో ఉన్న డబ్బుని పలు సైబర్ నేరగళ్లు ఖాళీ చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ దోస్త్ తెలిపింది. ఇటువంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండి అటువంటి లింకులపై క్లిక్ చేయకూడదని పేర్కొంది.