వచ్చే లోక్సభ ఎన్నికల వరకు ప్రజా పాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాన్సువాడలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో గెలిచిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు దాని ఊసే లేదన్నారు. పదివేలు ఉన్న రైతుబంధును 15000 చేసి ఇస్తామని ప్రకటించారని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరానికి ఇచ్చిన 10000 కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నిరుద్యోగ భృతి హామీ తాము ఇవ్వలేదని అన్నారని…. కానీ ప్రియాంక గాంధీ సభలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రభుత్వం పై ఉందని ఆయన అన్నారు.