తెలంగాణలో వచ్చే నెల నుంచి స్కూళ్లు, కాలేజీలు..!

తెలంగాణలో స్కూళ్లు కాలేజీలు తెరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు ఏడెనిమిది నెలల పాటు మూసుకున్న స్కూళ్లు, కాలేజీలు త్వరలో తెరవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. త్వరలోనే స్కూల్స్ తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో 9, 10 తరగతులతో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రస్తుతం క్లాసులు జరుగుతున్నాయి. ఏపీలో లాగానే తెలంగాణలో కూడా ఈ యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలి ? ఒక వేళ తెలిస్తే ఎలాంటి నిబంధనలు పాటిస్తూ తరగతులు జరగాలి అనే అంశం మీద విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ నిన్న విద్యా శాఖలోని వివిధ విభాగాల హెచ్ ఓ డి లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా 9, 10 తరగతుల తోపాటు ఇంటర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఆమోదిస్తే కనుక డిసెంబర్ 1 నుండి రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.