ప్రపంచ వ్యాప్తంగా ఏటా అనేక మంది హెచ్ఐవీ ఎయిడ్స్ కారణంగా చనిపోతున్న సంగతి తెలిసిందే. ఏటా ఎంతో మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి నిజానికి చికిత్స అంటూ ఏమీలేదు. అయితే ఈ వ్యాధి రాకుండా ముందుగానే జాగ్రత్త పడేందుకు గాను సైంటిస్టులు కొత్తగా ఓ ఇంజెక్టబుల్ డ్రగ్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని సీపీటీ31గా వ్యవహరిస్తున్నారు.
సైంటిస్టులు డెవలప్ చేసిన ఆ డ్రగ్‌ను ఇప్పటికే కోతులపై ప్రయోగించి పరిశీలించారు. ముందుగా కోతులకు ఆ డ్రగ్‌ను ఇచ్చారు. తరువాత వాటిని హెచ్ఐవీని పోలిన ఎస్‌హెచ్ఐవీ అనే వైరస్ కు ప్రభావితం చేశారు. తరువాత 30 రోజులకు వాటి రక్త నమూనాలను పరిశీలించగా సదరు డ్రగ్ ఎస్‌హెచ్ఐవీ కణాలను చాలా వరకు తగ్గించిందని గుర్తించారు. అందువల్ల ఈ డ్రగ్ HIV రాకుండా చూస్తుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ డ్రగ్‌ను ప్రస్తుతం జంతువులపై మాత్రమే ప్రయోగించారు. త్వరలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేపడుతారు. తరువాత ఫలితాలను బట్టి డ్రగ్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెడతారు. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు డ్రగ్స్ కన్నా ఈ డ్రగ్ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్‌ను కలిగి ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. సైంటిస్టులు చేపట్టిన ఈ డ్రగ్ పరిశోధనల వివరాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.