మీరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారా ? ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నంబర్ల కోసం ఇంటర్నెట్‌లో వెదుకుతున్నారా ? అయితే జాగ్రత్త. ప్రస్తుతం మోసగాళ్లు ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వినియోగదారుల డేటాను చోరీ చేయడమే కాకుండా కార్డుల సమాచారంతో డబ్బును దోచేస్తున్నారు. అందుకనే ఎస్‌బీఐ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది.
క్రెడిట్ కార్డులను వాడేవారు ఆ కార్డును అందించిన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్‌కే కాల్ చేయాలని ఎస్‌బీఐ సూచించింది. ఇక టోల్ ఫ్రీ నంబర్లు ఎప్పుడూ 1800-, 1888-, 1844- అనే సిరీస్‌తో ప్రారంభం అవుతాయని, ఇతర నంబర్లు ఉంటే వాటిని నమ్మకూడదని హెచ్చరించింది. అలాంటి నంబర్లు నకిలీవే అయి ఉంటాయని, వాటికి కాల్ చేస్తే వినియోగదారులు మోసపోయేందుకు అవకాశం ఉందని ఎస్‌బీఐ హెచ్చరికలు చేసింది.
ఇక కార్డులకు చెందిన ఓటీపీ, సీవీవీ, పిన్ వంటి వివరాలను ఇతరులకు చెప్పకూడదని ఎస్‌బీఐ తెలిపింది. అలాగే రివార్డు పాయింట్లను కన్వర్ట్ చేస్తామని చేసే ఫోన్ కాల్స్‌ను కూడా నమ్మొద్దని సూచించింది. లేదంటే మోసగాళ్ల చేతిలో నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది.