భారీ వర్షాలు.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

-

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఎగువన సైతం భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్రాల్లోని జలాశయాలకు జలకళ సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే.. భారీ వర్షాల మధ్య ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకున్నది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.19 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉపనదులు పొంగిపొర్లుతుండగా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజమండ్రిలోని ఘాట్లను మూసివేశారు. మరోవైపు కేంద్ర అధికారుల బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నది. గోదావరి ఉప నదులు పొంగిపొర్లి ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది. ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.

సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పూర్వ తూర్పు గోదావరి జిల్లాలో 3 ఎన్డీఆర్‌ఎఫ్‌ , 3 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వీఆర్‌ పురంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో చాలా లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పలు గ్రామాల ప్రజలు బ్రతుకు జీవుడా అంటూ పిల్లాపాపలతో లంకను వదిలి వెళ్లిపోతున్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పాశర్లపూడి-అప్పనపల్లి కాజ్‌వే నీట మునిగిపోయింది. ఫలితంగా నాలుగైదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సఖినేటిపల్లి మండలంలోని అప్పన్నరాముని లంక టేకీ శెట్టిపాలెం వంతెన నీట మునగడంతో రెండు గ్రామాల మధ్య వాహనాలు నడవడం లేదు. వరదల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు అధికారులు. సహాయం కోసం 89779 35609 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version