సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం.. ఇంకా అదుపులోకి రాని మంటలు

-

సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. నిన్న దాదాపు 8 గంటల పాటు అధికారులు శ్రమించి.. మంటలు ఆర్పారు. కానీ ఇవాళ తెల్లవారుజామున మళ్లీ అగ్గిరవ్వలు రాజుకున్నాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందిలో కొంత మంది దట్టమైన పొగవల్ల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

ఏడీఎఫ్​వో ధనుంజయ రెడ్డితో పాటు ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావు అస్వస్థతకు గురయ్యారు. వీళ్లిద్దరిని మొదట అగ్నిమాపక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి కాస్త విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ధనుంజయ రెడ్డి ఆరోగ్యం కాస్త కుదుటపడిందని.. కానీ డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నర్సింగ రావుకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

నిన్న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నల్లగుట్టలో డెక్కన్ స్పోర్ట్స్ వేర్ షాపింగ్​మాల్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలు.. ఆ షాపులో ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాలు ఉండటం వల్ల వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. దాదాపు 8 గంటలు శ్రమించి మంటలు ఆర్పారు. భవనంలో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడారు.

Read more RELATED
Recommended to you

Latest news