జంటనగరాల్లో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

-

సికింద్రాబాద్ డ్రగ్ టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బృందాలు వేర్వేరు ఘటనల్లో మొత్తం 5.260 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ రెండు కేసుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా, వారి వద్ద నుంచి ఒక కారు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదటి కేసులో, నిర్మల్‌కు చెందిన మలావత్ రాజేందర్, ఇండాల్ రాథోడ్‌లు 4.140 కిలోల గంజాయిని కారులో హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా బొయినిపల్లి వద్ద డీటీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఆదిలాబాద్ శివారు ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య తెలిపారు.

ఈ కేసులో ఇద్దరు నిందితులతో పాటు వారి వద్ద ఉన్న మూడు సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకుని సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ ఆపరేషన్‌లో సీఐతో పాటు ఎస్సై శివకృష్ణ, కానిస్టేబుళ్లు రాజు, రవి, సునీత పాల్గొన్నారు. ఈఎస్‌ శ్రీనివాసరావు పట్టుకున్న బృందాన్ని అభినందించారు. రెండో కేసులో, కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ బృందం దాడి చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నారాయణ చౌదారి అనే వ్యక్తి వద్ద నుంచి కొంత గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని షేర్‌లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ ఆపరేషన్‌లో ఎస్సై జ్యోతితో పాటు హెడ్‌కానిస్టేబుల్ లేఖా సింగ్, కానిస్టేబుళ్లు రాజేశ్వర్, చంద్రశేఖర్, కాశీరావు, శశి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news