టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణతో ఒక్కసారిగా విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుపై ఫోకస్ పెరిగింది.. చంద్రబాబు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌తో పాటు.. ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది.. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రత పెంచింది.
అంతకుముందు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్ట్ కొట్టివేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఎలాంటి ముప్పు లేదన్న సీఐడీ వాదనలతో ఏసీబీ కోర్ట్ ఏకీభవించింది. భద్రతపై చంద్రబాబు తరపు లాయర్లు చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోనికి తీసుకోలేదు.
సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒకటే ఉత్కంఠ.. కోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అంతా మంచే జరగాలని టీడీపీ కార్యకర్తలు ప్రార్థనలు చేశారు. మరోవైపు.. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలతో కలిపి టీడీపీ బంద్ నిర్వహించింది.